Srisailam VIP Break Darshan : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో కీలక మార్పులు చేసినట్లు దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో సంయుక్తంగా తెలిపారు. వారాంతాల్లో క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా… రద్దీని క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.
కొత్త దర్శన వేళల వివరాలు:
- వారాంతపు రోజుల్లో (శని, ఆది, సోమవారాలు) : ఈ మూడు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు కేవలం రాత్రి 9 గంటల సమయంలోనే స్పర్శదర్శనం కల్పిస్తారు.
- ఆన్‌లైన్ భక్తులకు యథావిధిగా : 'మనమిత్ర' వాట్సప్ మరియు ఆన్‌లైన్ విధానాల ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం ఉదయం 7.30 గంటలకు కల్పించే స్పర్శదర్శనంలో ఎలాంటి మార్పూ లేదు, అది యథావిధిగా కొనసాగుతుంది.

వారాంతాల్లో శ్రీశైలానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, అందరికీ స్వామివారి దర్శనం సజావుగా సాగేలా చూసేందుకే ఈ మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ మార్పులతో సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కొత్త విధానాలను భక్తులు గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ రమేశ్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు.