TTD Alipiri Path Safety : అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు టీటీడీ బిగ్ ప్లాన్ - ప్రత్యేక ఎమర్జెన్సీ టీమ్స్
తిరుమల అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణే ధ్యేయంగా టీటీడీ, అటవీ శాఖ సంయుక్తంగా సరికొత్త శాశ్వత కార్యాచరణను సిద్ధం చేశాయి. వన్యప్రాణుల సంచారాన్ని శాస్త్రీయంగా అరికట్టడంతో పాటు, అత్యవసర సమయాల్లో క్షణాల్లో స్పందించేందుకు 'ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్'ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు.
TTD Alipiri Path Safety : కాలిబాట మార్గంలో తిరుమల వెళ్లే భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నడక మార్గంలో వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని 'సుధర్మ' సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

డేటా విశ్లేషణ – శాస్త్రీయ అధ్యయనం
గత కొన్నేళ్లుగా నడక మార్గంలో చోటుచేసుకున్న వన్యప్రాణుల దాడులు, ఆయా సమయాల్లో క్రూర జంతువుల ప్రవర్తన మరియు వాటి ధోరణులపై సేకరించిన సమగ్ర డేటాను విశ్లేషించాలని అదనపు ఈవో సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక శాశ్వత నివారణ ప్రణాళికను రూపొందించాలన్నారు.
ముఖ్యంగా తిరుమల అటవీ ప్రాంతంలో జంతువుల సంచార మార్గాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి…. భక్తులకు ప్రమాదం పొంచి ఉన్న సున్నితమైన ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అలిపిరి నడక మార్గంలో ఉన్న దుకాణాల నిర్వహణ వల్ల వన్యప్రాణుల సంచారంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. అలాగే…. అడవిలో ఆహార వ్యర్థాలు లేదా ఇతర చెత్తను పారేయడం వల్ల క్రూర జంతువులు నడక మార్గానికి ఆకర్షితులవుతున్నాయని, కాబట్టి చెత్త నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
- నడక మార్గంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక 'ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' ను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
- ఈ బృందానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని కేటాయిస్తారు.
- అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఆధునిక పరికరాలు, ప్రత్యేక వాహనాలు, అధునాతన కమ్యూనికేషన్, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతారు.
- వన్యప్రాణుల కదలికలు కనిపించినా లేదా ఏదైనా ఘటన జరిగినా ఈ టీమ్ తక్షణమే రంగంలోకి దిగి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.
వన్యప్రాణుల నిరంతర పర్యవేక్షణ కోసం టీటీడీ, అటవీ శాఖ, విజిలెన్స్, ఇంజినీరింగ్ మరియు ఆరోగ్య శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచనున్నారు. అంతకుముందు టీటీడీ డీఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత రెండేళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరును ఉన్నతాధికారులకు వివరించారు.
భక్తుల భద్రత - ముఖ్యమైన చర్యలు:
- శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆధునిక వాహనాలు, పరికరాలతో ప్రత్యేక బృందం ఏర్పాటు.
- ఇప్పటికే గుర్తించిన 3 ప్రధాన ప్రమాద కారకాలపై ప్రత్యేక కార్యాచరణ.
- అటవీ ప్రాంతంలో ఆహార వ్యర్థాలు పారేయకుండా కఠిన నిబంధనలు.
- నడక మార్గంలోని దుకాణాల వల్ల భద్రతపై పడే ప్రభావంపై సమగ్ర అధ్యయనం.
- చిరుతల సంచారాన్ని కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల నిరంతర నిఘా.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

