తిరుమల నిత్య హారతిపై కర్ణాటక సీఎం ప్రపోజల్ రిజెక్ట్.. టీటీడీ ఛైర్మన్ కామెంట్స్
తిరుమల నిత్య హారతిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం జరిగే మొదటి హారతి (నిత్య హారతి) దర్శనానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన సరికొత్త వీఐపీ ప్రొటోకాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ బోర్డు తీవ్రంగా తోసిపుచ్చింది. శతాబ్దాలుగా వస్తున్న ఆలయ సాంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలను పొరుగు రాష్ట్రానికి చెందిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చడం సాధ్యం కాదని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు స్పష్టం చేశారు.

ఇటీవల తిరుమల పర్యటన ముగించుకున్న అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ బెంగళూరులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతిరోజూ ఉదయం ఇచ్చే నిత్య హారతిలో కర్ణాటక ప్రముఖులు పాల్గొనేలా ప్రోటోకాల్‌లో మార్పులు చేస్తామని డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటివరకు కేవలం కర్ణాటక ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక అధికారి మాత్రమే ఈ హారతిని వీక్షించే అవకాశం ఉండేదని, కానీ ఇకపై తమ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు ఎవరు వెళ్లినా ఆ ప్రొటోకాల్ వర్తించేలా తమ ప్రభుత్వం ఒక అధికారిక జీవో జారీ చేస్తుందని శివకుమార్ ప్రకటించారు. కర్ణాటక ప్రజాప్రతినిధులు చాలామంది దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఇది ఏమాత్రం ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యగా, దేవాలయ పరిపాలనా విషయాల్లో పొరుగు రాష్ట్రం చేసిన అధికార అతిక్రమణగా బోర్డు అభివర్ణించింది.
తిరుమల గర్భగుడిలో జరిగే ఈ నిత్య హారతి దర్శన భాగ్యం అనేది చారిత్రాత్మకంగా మైసూర్ మహారాజులకు కల్పించిన ప్రత్యేక హక్కు. తిరుమల ఆలయ అభివృద్ధికి వారు చేసిన సేవలు, విరాళాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఇది ఒక నిర్దిష్టమైన వంశ పారంపర్య సంప్రదాయం, నాన్-ట్రాన్స్‌ఫరబుల్ ప్రివిలేజ్ (బదిలీ చేయడానికి వీల్లేని హక్కు). 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైసూర్ మహారాజుల ప్రతినిధిగా ఒక్క స్పెషల్ ఆఫీసర్‌కు మాత్రమే దీనిని కొనసాగించారు.
తిరుమల ఆలయం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంటుందని, ఇది పూర్తిగా టీటీడీ బోర్డు నియమ నిబంధనలు, ఆగమ శాస్త్రాలకు లోబడి పనిచేస్తుందని గుర్తు చేశారు బీఆర్ నాయుడు. పొరుగు రాష్ట్ర కేబినెట్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు ఇక్కడ చెల్లవని స్పష్టం చేశారు.
ఒకవేళ కర్ణాటక ప్రతిపాదనను అంగీకరిస్తే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి డిమాండ్లు వచ్చే ప్రమాదం ఉంది. రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను, వీఐపీ సంస్కృతిని గర్భగుడి వరకు తీసుకురావద్దని టీటీడీ బోర్డు సభ్యులు డి.కె. శివకుమార్‌కు హితవు పలికారు. ఈ వ్యవహారంపై రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


