టీటీడీ నియామకాలు, దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు.. బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
TTD Board Meeting : టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు చేస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియామకం చేపడుతున్నట్టుగా తెలిపింది.
టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీమ్‌లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. అనంతరం ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి (యూనిఫార్మిటీ) తీసుకురావడానికి టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టామన్నారు. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.6.31 కోట్లతో తిరుమలలో SSD టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లు ఆమోదం.
తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యామ్‌లు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్లు మంజూరుకు ఆమోదం.
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జీఎన్‌సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ఆమోదం.
తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50గా (జీఎస్టీతో కలిపి) ప్రవేశ రుసుము నిర్ణయించారు. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థ ద్వారా నిర్వహించేందుకు గాను ఆ సంస్థను కోరాలని నిర్ణయం.
తిరుమల కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైబడిన పాత ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి రూ.5 కోట్లు మంజూరుకు ఆమోదం.
భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో నిర్వహణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం.
తిరుమలలోని T B C, A T C విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి, వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనానలు నిర్మించేందుకు నిర్ణయం.
2027వ సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 75 వేలు ముద్రించేందుకు ఆమోదం.
తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, FMS సేవలకు రూ.2.91 కోట్లు మంజూరు.
ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలోని వెయ్యి గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం.
రూ.17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల సౌకర్యార్థం 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు టీటీడీ బోర్డు ఆమోదం.
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై 'సాలహారం' నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్లతో టెండర్ కు ఆమోదం.
టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో కూడా నిత్య పారాయణం, లోక కల్యాణం జరిగేలా వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల పారితోషికాన్ని ఆయా కళాకారుల నైపుణ్యాన్ని బట్టి పెంచేందుకు ఆమోదం తెలిపింది.
టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులుగా UP GRADE చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


