అలిపిరి వద్ద టీటీడీ మాస్టర్ ప్లాన్.. భక్తుల వసతి కోసం కొండ కింద భారీ ప్రాజెక్ట్

భక్తులకు వసతి సమస్యలు రాకుండా ఉండేందుకు టీటీడీ భారీ ప్రాజెక్ట్‌తో వస్తోంది. అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్ స్పిరిచువల్ పిల్‌గ్రిమ్ టౌన్‌షిప్‌ను నిర్మించతలపెట్టింది.

Published on: May 30, 2026, 09:05:47 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ వైకుంఠం తిరుమల కొండపై భక్తుల వసతి రద్దీని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఒక భారీ వ్యూహాత్మక ప్రాజెక్టును వేగవంతం చేసింది. తిరుపతిలోని అలిపిరి పాదాల చెంత అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పిరిచువల్ పిల్‌గ్రిమ్ టౌన్‌షిప్(Integrated Spiritual Pilgrim Township) నిర్మాణానికి టీటీడీ బోర్డు అధికారికంగా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

తిరుమల కొండ
తిరుమల కొండ

ఈ ప్రాజెక్టు పనుల పురోగతి, శంకుస్థాపన ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడును కలిసి సుదీర్ఘంగా చర్చించారు. టౌన్‌షిప్ నిర్మాణం కోసం అలిపిరి వద్ద భూమిని కూడా ఖరారు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్‌కు ముందు దాదాపు 30 ఎకరాలు, గరుడ సర్కిల్ దాటిన తర్వాత ఎస్వీ జూ పార్క్ రోడ్డు వైపు మరో 45 ఎకరాల భూమిని (మొత్తం సుమారు 75 ఎకరాలు) సేకరించారు.

ఈ టౌన్‌షిప్ ప్రస్తుత జూ పార్క్ రోడ్డుకు ఎడమ వైపున ఉంటుంది. ఇక్కడి నుండి భక్తులు రోడ్ అండర్ బ్రిడ్జ్ ద్వారా నేరుగా అలిపిరి టోల్‌గేట్‌కు చేరుకునేలా లింక్ రోడ్డును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టును తిరుమల కొండకు ఒక హైటెక్ బేస్ క్యాంప్ లాగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల కొండపై గదుల కొరత సమస్య పూర్తిగా తొలగిపోనుంది.

తిరుమలకి వచ్చే భక్తులకు అలిపిరి పాదాల చెంతే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలిన ఒక అద్భుతమైన ప్రతిరూపాన్ని ఇక్కడ నిర్మించనున్నారు. ఒకేసారి 20,000 నుండి 25,000 మంది భక్తులు బస చేసేలా, అన్ని రకాల సదుపాయాలను పొందేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభ వ్యయం రూ.100 కోట్ల నుండి రూ. 600 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. సాంప్రదాయ ద్రావిడ శిల్పకళా వైభవం ఉట్టిపడేలా బాహ్య రూపాన్ని అందిస్తూనే, లోపల ఎక్కువ మంది పట్టేలా హై-డెన్సిటీ వర్టికల్ లాడ్జింగ్ సదుపాయాలను కల్పిస్తారు.

తిరుమలకు ప్రతిరోజూ 70 వేల నుండి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం కొండపై వసతి గదుల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దే ఇంతటి భారీ టౌన్‌షిప్ నిర్మించడం వల్ల భక్తులు కొండ కిందనే డిజిటల్ లాకర్లు, వసతి, ఉచిత భోజన సదుపాయాలు పొంది, కేవలం దర్శన సమయానికి మాత్రమే కొండపైకి వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.

ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కఠినమైన గడువులను విధించుకుంది. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌ల నుండి సాంకేతిక, డిజైన్ ప్రతిపాదనలను టీటీడీ ఇప్పటికే ఆహ్వానించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More