తిరుపతిలోనూ ట్యాంక్‌బండ్.. భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం
తిరుపతిలోనూ హైదరాబాద్ తరహా ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్‌గా మార్చేందుకు భారీ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
తిరుపతి నగరాన్ని వాతావరణ మార్పులను తట్టుకునేలా(Climate-resilient), సాంప్రదాయ చెరువులు, జలాశయాల పునరుద్ధరణ ద్వారా “సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్”గా మార్చేందుకు ప్రతిపాదించిన రూ.750 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణా చర్యలను బలోపేతం చేయడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA) ఈ 'క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇన్ తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియా' ప్రాజెక్టును ప్రతిపాదించింది. తిరుపతిలోని చారిత్రాత్మక చెరువులు, కుంటలు, సహజ పారుదల కాలువల నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తూ, పర్యావరణహిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ... 'గతంలో తిరుపతిలోని ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న జలాశయాలు వరదలను నియంత్రించడంలో, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషించేవి. అయితే వేగవంతమైన పట్టణీకరణ, ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం, మురుగునీరు చేరడం, సహజ అనుసంధానాలు తెగిపోవడం వల్ల ఈ వ్యవస్థ బలహీనపడింది. నవంబర్ 2021లో సంభవించిన తీవ్రమైన వరదలు నగరం ఈ బలహీనతను స్పష్టం చేశాయి.' అని పేర్కొన్నారు.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు
ఈ ప్రాజెక్టు కింద 25 చెరువులు, కుంటల పునరుద్ధరణ చేస్తారు. తిరుపతి పరిసరాల్లోని సుమారు 25 జలాశయాలకు పునర్జీవం పోస్తారు. సహజ నీటి ప్రవాహాలను క్రమబద్ధీకరించడం, చెరువు కట్టలు, మత్తడులు, అనుసంధాన కాలువలను బలోపేతం చేస్తారు. నీటి వనరుల్లో పూడికతీత పనులు చేపట్టడం, మురుగునీరు చేరకుండా నిరోధించడం జరుగుతుంది. పర్యావరణహిత ప్రజా మౌలిక వసతుల కల్పన ఉంటుంది.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ 'ట్యాంక్ బండ్' తరహాలో తిరుపతిలోని అవిలాల చెరువును ప్రాధాన్యత ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు. ఈ రూ.750 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పలు విభాగాలుగా విభజించారు. 250 కోట్లు జలాశయాల పునరుద్ధరణ కోసం. రూ.250 కోట్లు సమగ్ర తుఫాను నీటి నిర్వహణకు, 250 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, సర్వేలు, డీపీఆర్ తయారీ, ఇతర అవసరాల కోసం.
మొత్తం వ్యయంలో సుమారు రూ.500 కోట్లు (50 మిలియన్ యూరోలు) నిధులను భారత ప్రభుత్వ 'ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్' ఫ్రేమ్‌వర్క్ కింద, జర్మనీకి చెందిన KfW డెవలప్‌మెంట్ బ్యాంక్ నుండి రాయితీ రూపంలో విదేశీ సహాయంగా పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత ఆమోదం కేవలం ప్రాజెక్టు తయారీ, పరిశీలనకు మాత్రమే పరిమితమని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా హైడ్రోలాజికల్ స్టడీస్, పర్యావరణ అంచనాలు, ఆర్థిక సాధ్యసాధ్యాల పరిశీలన, వాటాదారుల సంప్రదింపులను తుడా ప్రారంభించనుంది. చట్టబద్ధమైన అనుమతులు, తుది ఆర్థిక ఆమోదాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక పూర్తయిన తర్వాతే పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


