అమరావతిలో వరుస అగ్నిప్రమాద ఘటనలు - విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాజధాని అమరావతిలో వెలుగు చూసిన అగ్ని ప్రమాదాలపై సీఎం సమీక్షించారు. ఇవన్నీ నిజమైన ప్రమాదాలేనా..? లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలని పోలీసులను ఆదేశించారు.

Published on: Mar 25, 2026, 06:25:50 IST
PTI | By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజధాని అమరావతిలో నిప్పుపై నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా…? లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా…? అనేది వెలికి తీయాలని సిఎం ఆదేశించారు.

పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతిలో వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర కోణం ఉందనే అనుమానం వస్తోందని... ఆ దిశగా మరింత లోతుగా అన్నికోణాల్లోనూ విచారణ జరపాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు... ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కుట్ర కోణం ఉందా అనే విషయం కూడా విశ్లేషించాలన్నారు.

రాయపూడిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద నిర్మాణ సంస్థకు చెందిన పైపులు గత రాత్రి దగ్ధం అయిన ఘటనపై సచివాలయంలోని తన చాంబర్‌లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్హాలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమద ఘటన గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏ సమయంలో ప్రమాదం జరిగింది... ఎన్నింటికి అగ్నిప్రమాదంపై ఫైరింజన్‌కు కాల్ వచ్చింది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో అంత త్వరగా మంటలు వ్యాపించడానికి కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలని సిఎం సూచించారు.

సీసీ కెమెరాలు పెట్టాలి - సీఎం

రాజధానిలో పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కోట్ల విలువైన సామగ్రి రాజధాని ప్రాంతంలో నిల్వచేసి పెట్టారని…. పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఘటన వల్ల అనవసరమైన అడ్డంకులు ఏర్పడతాయన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాజధాని ప్రాంతంలో, పనులు జరుగతున్న దగ్గర అదనపు పెట్రోలింగ్ నిర్వహించాలి. ప్రతి నిర్మాణ సంస్థ తమ సామగ్రి నిల్వ చేసుకునే యార్డులో సిసి కెమేరాలు తప్పక ఏర్పాటు చేయాలి. అదే విధంగా సామగ్రి నిల్వ కేంద్రాల వద్ద వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. డ్రోన్ కెమెరాలు ద్వారా ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించాలి. తమ సామగ్రి ఉన్న యార్డుల వద్ద తగిన భద్రత ఏర్పాటు చేసుకోవడంతో పాటు, భద్రతా చర్యలు చేపట్టడంపై కూడా నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వారి రాకపోకలను కూడా గమనించాలన్నారు. అనుమానితులు ఉంటే ప్రశ్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. వరుస ఘటనలో అలజడి సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు తేలితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దని... కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More