దేశ రాజధాని దిల్లీలో కలకలం! 15 రోజుల్లో 800 మంది అదృశ్యం- అసలేం జరుగుతోంది?
దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగించే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2026 సంవత్సరం ప్రారంభమైన మొదటి 15 రోజుల్లోనే అక్కడ ఏకంగా 800 మందికి పైగా అదృశ్యమైనట్లు పోలీస్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మూడింట రెండు వంతుల మంది మహిళలు, బాలికలే ఉండటం గమనార్హం.
దేశ రాజధాని దిల్లీలో మహిళలు, చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తించే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2026 సంవత్సరం ప్రారంభ 15 రోజుల్లోనే దిల్లీలో 800 మందికి పైగా అదృశ్యమైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. అదృశ్యమైన వారిలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలు, బాలికలే ఉన్నారు.

పీటీఐ సేకరించిన దిల్లీ పోలీసుల అధికారిక డేటా ప్రకారం.. జనవరి 1 నుంచి జనవరి 15 మధ్య కాలంలో మొత్తం 807 మంది అదృశ్యమయ్యారు. అంటే సగటున ప్రతిరోజూ 54 మంది ఆచూకీ లేకుండా పోతున్నారు. వీరిలో 509 మంది మహిళలు, బాలికలు కాగా, 298 మంది పురుషులు ఉన్నారు.
వయస్సుల వారీగా వివరాలు..
మొత్తం అదృశ్యమైన వారిలో 191 మంది మైనర్లు ఉండగా, 616 మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు, మిగిలిన 572 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
చిన్నారుల పరిస్థితి: జనవరి మొదటి 15 రోజుల్లో సగటున రోజుకు 13 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. మొత్తం 191 మంది మైనర్లలో 146 మంది బాలికలే కావడం గమనార్హం.
టీనేజర్లు: అదృశ్యమైన మైనర్లలో 169 మంది టీనేజర్లు ఉన్నారు. వీరిలో 138 మంది అమ్మాయిలు కాగా, 31 మంది అబ్బాయిలు. పోలీసులు 29 మంది అమ్మాయిలను, 19 మంది అబ్బాయిలను గుర్తించారు. అయితే అదృశ్యమైన టీనేజర్లలో 71 శాతం మంది ఇంకా ఆచూకీ లేకుండానే ఉన్నారు.
8 నుంచి 12 ఏళ్లు: ఈ వయస్సులో 13 మంది పిల్లలు (8 మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు) అదృశ్యం కాగా, కేవలం ముగ్గురు అబ్బాయిలను మాత్రమే పోలీసులు కనిపెట్టగలిగారు.
8 ఏళ్ల లోపు: ఈ విభాగంలో 9 మంది పిల్లలు అదృశ్యం కాగా, ముగ్గురు అబ్బాయిలు దొరికారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
పెద్దల అదృశ్యం: అదృశ్యమైన వారిలో అత్యధిక భాగం పెద్దలే ఉన్నారు. జనవరి మొదటి 15 రోజుల్లో 616 మంది పెద్దలు మిస్ అవ్వగా, వారిలో 363 మంది మహిళలు, 253 మంది పురుషులు ఉన్నారు. పోలీసులు 90 మంది పురుషులను, 91 మంది మహిళలను గుర్తించగా, ఇంకా 435 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న ఆందోళన..
గతేడాది (2025) గణాంకాలను పరిశీలిస్తే, దిల్లీలో మొత్తం 24,508 మంది అదృశ్యమయ్యారు. అందులో మహిళలే 60 శాతం (14,870 మంది) ఉన్నారు. పోలీసులు 15,421 మందిని గుర్తించగా, 9,087 కేసులు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.
గత పదేళ్ల విశ్లేషణ ప్రకారం దిల్లీలో అదృశ్యమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో మొత్తం 2,32,737 మంది అదృశ్యం కాగా, సుమారు 1.8 లక్షల మందిని పోలీసులు గుర్తించారు. కానీ దాదాపు 52,000 కేసులు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.
ముఖ్యంగా టీనేజర్లకు పొంచి ఉన్న ముప్పుపై ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. 2016 నుంచి ఏటా సగటున 5,000 మంది టీనేజర్లు మిస్ అవుతుండగా, అందులో 3,500 మంది అమ్మాయిలే ఉంటున్నారు. 2025లో అదృశ్యమైన 5,081 మంది టీనేజర్లలో 3,970 మంది అమ్మాయిలే కాగా, వారిలో 1,013 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు.

E-Paper












