విజన్ యూనిట్స్‌గా గ్రామ సచివాలయాల పేరు మార్పు - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!
గ్రామ సచివాలయాల వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాటిని విజన్ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించారు. వాటిని సమర్ధంగా వినియోగించుకునే దిశగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. డేటా ఆధారిత పాలనపై సదస్సులో ఈ అంశంపై చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. డేటా ఆధారిత పాలనపై సదస్సును ఉద్దేశించి సీఎం ప్రసగించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని సూచించారు.

విజన్ యూనిట్‌గా మార్పు - సీఎం చంద్రబాబు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. “గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్ధంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందాం. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్‌ను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నాం. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నాం” అని వివరించారు.
గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. నెలలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు.
“నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి” అని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
“డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే అనలటిక్స్ చేసి వాటి ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రిడిక్టివ్ అనలటిక్స్‌కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతోంది. ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్‌ను సమర్ధంగా వినియోగించాలి. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
జిల్లాల్లోనూ RTGS కేంద్రాలు - సీఎం
రెవెన్యూ సహా ఇతర శాఖల సేవలు వీలైనన్ని ఆన్ లైన్ లేదా, వాట్సాప్ గవర్నెనెన్సు ద్వారానే అందాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని తెలిపారు.
“అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. గత పాలకుల వల్ల 22ఏ లాంటి వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత భాద్యతగా వ్యవహరించాలి. ఆయా శాఖలు తమ పనితీరును మార్చుకోవాల్సి ఉంది. పెన్షన్ వితరణ, ఆర్టీసీ, రేషన్ లాంటి చోట్ల మంచి పనితీరు కనపడుతోంది. కానీ శానిటేషన్ విషయంలో ఆర్టీసీ కొంత వెనకబాటులో ఉంది. ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు రేటింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

