'తెలంగాణకు కూడా నీటిని ఇవ్వొచ్చు' - నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు.. పొరుగు రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తెలంగాణకు కూడా నీటిని ఇచ్చే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Published on: Jan 18, 2026, 07:43:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ఏడాది హంద్రీ-నీవా కాల్వ వెడల్పు పనులకు గడువు నిర్దేశించుకుని పూర్తి చేశామని... అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామని గుర్తు చేశారు. అదే తరహాలో 2026 ఏడాదిలో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

శనివారం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో ఉద్యాన రంగంలోని అభివృద్ధి కార్యక్రమాలు, పూర్వోదయ పథకం, నల్లమల సాగర్ సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పీపీపీ ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ పథకం, సాస్కీ నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు.

దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయా పథకాలు, ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం... దావోస్ పర్యటన నుంచి తిరిగి రాగానే తనకు సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… "2026లో కీలక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా పూర్వోదయ స్కీం ద్వారా ప్రకాశం సహా రాయలసీమలోని తొమ్మిది జిల్లాల్లో అభివృద్ధి చేయొచ్చు. ఉద్యాన రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. పూర్వోదయ స్కీంలో భాగంగా విడతల వారీగా ఉద్యాన రంగ అభివృద్ధిపై దృష్టి సారించాలి”అని సీఎం ఆదేశించారు.

“ఇక ఈ ఏడాది ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పని చేయాలి. ముఖ్యంగా వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తి చేయాల్సి ఉంది. వీటి నిర్మాణం విషయంలో టార్గెట్ పెట్టుకోవాలి. ఇక నల్లమల సాగర్ విషయంలో కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో సంప్రదింపులు జరపాలి. వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందేలా సహకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వొచ్చు - సీఎం

“తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సముద్రంలోకి వృధాగా వెళ్ళే వరద నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలన్నదే ఉద్దేశం. అందుకే మేం అభ్యంతరం చెప్పలేదు. వృథాగా పోయే జలాలను వాడుకునేలా రూపొందించిన నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడంతోపాటు.. పొరుగు రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయ్యాక అవసరమైన పక్షంలో తెలంగాణకు కూడా నీటిని ఇచ్చే పరిస్థితి ఉంటుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

"ఈ ఏడాది పీపీపీ పద్దతిన వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. సుమారు 290 ప్రాజెక్టులను మొదటి విడతలో చేపట్టాలి. దీనికి కేంద్రం నుంచి సహకారం లభిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీపీపీ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేయండి. జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచాలి. 2027 నాటికి ఈ స్కీం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి”అని ముఖ్యమంత్రి తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More