...
...
Next Story

2027 నాటికి బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

2027 నాటికి బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రవాణా వ్యయం తగ్గించేలా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీశాఖపై సమీక్షించిన ఆయన… పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Published on: Jan 30, 2026, 05:30:07 IST
Advertisement

రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు.

జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

క్యాంపు కార్యాలయంలో గురువారం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు, ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏపీ బెంచ్ మార్క్ గా ఉండాలి - సీఎం

శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను ఈ జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచనలు జారీ చేశారు. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చేసేలా హింటర్ ల్యాండ్‌ను కనెక్టు చేసేలా రోడ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో దేశంలోనే ఏపీ బెంచ్ మార్క్ గా ఉండాలని స్పష్టం చేశారు.

2027 నాటికి పూర్తి కావాలి….

ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా, 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రూ.42,194 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగుళూరు-కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027 కల్లా పూర్తి కావాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రహదారి నెట్వర్క్ ను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి రహదారులు భవనాల శాఖను ఆదేశించారు. రూ.2500 కోట్లతో 6,054 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రహదారుల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, తిరుపతి ఐఐటీ రూపొందించిన నానో కాంక్రీట్ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మకంగా రోడ్లను వేస్తున్నామని తెలిపారు. 45 వేల కిలోమీటర్ల రాష్ట్ర, జిల్లా రహదారుల్లో ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. రామ్స్ టెక్నాలజీ ద్వారా రోడ్ల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీపీపీ కింద 709 కిలోమీటర్ల మేర 12 రహదారులను కూడా చేపట్టాలని స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పటిష్టంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe