విశాఖలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌, సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు కూడా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా మారబోతోందని అభిప్రాయపడ్డారు.

Published on: Dec 12, 2025 2:12 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నంలో రూ.3,700 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ తో పాటు మరో ఎనిమిది కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తో పాటు ఇతర కంపెనీల ద్వారా సుమారు 41,700 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా.

కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ రూ.1,583 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద కాగ్నిజెంట్ కు ప్రభుత్వం 21 ఎకరాలకు పైగా కేటాయించింది. అక్కడ మూడు దశల్లో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ ను నిర్మిస్తుందని వారు వివరించారుయ

మొదటి దశ పూర్తయ్యే వరకు… కాగ్నిజెంట్ తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్క్, హిల్ -2లోని మహతి ఫిన్టెక్ బిల్డింగ్ నుంచి పని చేస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ పై దృష్టి సారిస్తుంది. ఇవాళ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఇతర కంపెనీలలో టెక్ తమ్మినా, సాత్వ డెవలపర్స్, ఇమాజినేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి.

1 లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలని - సీఎం చంద్రబాబు

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…. ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోందన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని… ఇప్పుడు విశాఖకూ కాగ్నిజెంట్ అడుగుపెట్టిందని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో 1 లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను. 11 నెలల్లోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారు కావాలి. ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోంది" అని చెప్పారు.

“ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటిగా విశాఖను తీర్చిదిద్దుతాం దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖే. 2032కి 130 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుంది. ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్ గా తయారైంది. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉంది” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి మాట్లాడుతూ…. "జనవరి నెలలో దావోస్ లో మమ్మల్ని మంత్రి లోకేష్ కలిసారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మాకు సమయం కావాలని అడిగితే… కుదరదు ఇప్పుడే చెప్పండి, మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే క్లియర్ చేస్తామని చెప్పారు. గంటన్నరలో మాతో విశాఖలో పెట్టుబడికి ఒప్పించారు. ఇక్కడితో అయిపోలేదు… వచ్చే దావోస్ నాటికి, కాగ్నిజెంట్ విశాఖలో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. లోకేష్ గారికి హామీ ఇచ్చినట్టే, నెల ముందే మేము విశాఖలో కాగ్నిజెంట్ మొదలుపెట్టాం" అని చెప్పుకొచ్చారు.

తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం

1,000 మంది ఉద్యోగులకు వసతి కల్పించే తాత్కాలిక క్యాంపస్ ను ఇవాళ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐటీ మంత్రి నారా లోకేష్… కాగ్నిజెంట్ ఉద్యోగులతో మాట్లాడారు.

కాగ్నిజెంట్ కోసం ‘కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఐటీ క్యాంపస్‌ను మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనుందని తెలిపింది. 2029 నాటికి మొదటిదశ పూర్తి చేయడం ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. 2033 నాటికి మూడు దశలను సంస్థ పూర్తి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.