ఏపీలో అమల్లోకి కామన్ జోనింగ్ నిబంధనలు.. 9 కేటగిరీలుగా భూములు

రాష్ట్రంలో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే విధమైన కామన్ జోనింగ్ రెగ్యులేషన్ 2026ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో రాజధాని అమరావతి ప్రాంతాన్ని మినహాయించారు.

Published on: Jul 19, 2026, 14:18:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూ వినియోగం, పట్టణాభివృద్ధిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రకమైన, నిబంధనల ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెడుతూ కామన్ జోనింగ్ నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. గతంలో 2025 అక్టోబర్ 22న మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో నంబర్ 216 స్థానంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

అమరావతి మినహా

ఈ కొత్త రూల్స్ రాష్ట్ర రాజధాని ప్రాంతం మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లోని మాస్టర్ ప్లాన్లు, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్లు, జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీమ్‌లకు వర్తిస్తాయి. గతంలో ఉన్న అనేక రకాల జోనింగ్ విధానాలను రద్దు చేస్తూ, కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో భూ వినియోగాన్ని 9 ప్రామాణిక కేటగిరీలుగా సరళీకరించారు. అవి : రెసిడెన్షియల్ (నివాస ప్రాంతాలు), కమర్షియల్ (వాణిజ్య ప్రాంతాలు), పబ్లిక్ & సెమీ-పబ్లిక్ (ప్రజా, ప్రభుత్వ అవసరాలు), రిక్రేషనల్ (వినోద ప్రదేశాలు, ఇండస్ట్రియల్ (పరిశ్రమలు), ట్రాన్స్‌పోర్టేషన్ (రవాణా రంగానికి సంబంధించినవి), మిక్స్‌డ్ యూజ్ (బహుళ ప్రయోజన జోన్లు), అగ్రికల్చరల్ (వ్యవసాయ మండలాలు), డెవలప్‌మెంట్-రెస్ట్రిక్టెడ్ జోన్లు (అభివృద్ధి నిషిద్ధ ప్రాంతాలు) ఉన్నాయి.

'డెవలప్‌మెంట్-రెస్ట్రిక్టెడ్' కేటగిరీ కిందకు చారిత్రక కట్టడాలు(హెరిటేజ్), రక్షణ రంగానికి చెందిన రక్షిత ప్రాంతాలు, అడవులు, కొండలు, జలవనరులు, పర్యావరణ సున్నిత ప్రాంతాలు, తీరప్రాంత నియంత్రణ జోన్లు వస్తాయి.

ప్రత్యేకంగా లిస్ట్

ఈ కొత్త నిబంధనలలో ప్రభుత్వం 'జోన్ల వారీగా నెగెటివ్-లిస్ట్' విధానాన్ని తీసుకొచ్చింది. అంటే, ఒక నిర్దిష్ట జోన్‌లో ఏయే పనులను/వ్యాపారాలను చేయకూడదో (నిషేధించారో) ఆ జాబితాను మాత్రమే ఇస్తారు. ఆ జాబితాలో లేని, పర్యావరణానికి, నిబంధనలకు అనుకూలంగా ఉండే ఇతర పనులను అక్కడ చేపట్టవచ్చు. అయితే ప్రతి అభివృద్ధి పని కూడా కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్, లేఅవుట్ రూల్స్, పర్యావరణ నిబంధనలు, రోడ్డు వెడల్పు, పార్కింగ్ ప్రమాణాలు, సేఫ్టీ డిస్టెన్స్ నిబంధనలకు లోబడి ఉండాలి.

నివాస ప్రాంతాలలో నిషేధాలు

కాలుష్యం కలిగించే పరిశ్రమలు, ప్రమాదకరమైన స్టోరేజ్ గోదాములు, స్లాటర్ హౌస్‌లు, పెద్ద లాజిస్టిక్స్ కేంద్రాలు, మైనింగ్ మరియు వ్యర్థాల పారేసే పనులను రెసిడెన్షియల్ ఏరియాల్లో పూర్తిగా నిషేధించారు. పార్కులు, అడవులు, కొండలు, జలవనరులు, హెరిటేజ్ ప్రాంతాలలో ప్రకృతికి విఘాతం కలిగించే ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు.

వాణిజ్య, వ్యవసాయ భూములకు ప్రత్యేక నిబంధనలు

కనీసం 300 చదరపు మీటర్ల స్థలం ఉండి, 60 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్డు పక్కన ఉండే ప్లాట్లలో, నిర్ణీత ఇంపాక్ట్ ఫీజు మరియు ల్యాండ్-యూజ్ ఛార్జీలు చెల్లించి నిర్దేశిత నాన్-రెసిడెన్షియల్ పనులు చేసుకోవచ్చు. (ఈ వెసులుబాటు పార్కులు, రక్షిత జోన్లకు వర్తించదు).

వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) నిబంధనలకు లోబడి, తగిన బఫర్ జోన్లు పాటిస్తూ వైట్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలను వ్యవసాయ జోన్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్‌లో ఫార్మ్‌హౌస్ కట్టుకోవాలంటే కనీసం 0.50 ఎకరం స్థలం ఉండాలి. మొత్తం స్థలంలో నిర్మాణ విస్తీర్ణం 10 శాతానికి మించకూడదు. భవనం గరిష్టంగా G+1 అంతస్తులు, 11 మీటర్ల ఎత్తులోపు మాత్రమే ఉండాలి. రోడ్డు వెడల్పులు, పార్కింగ్, సెట్‌బ్యాక్‌లు, నదులు, కాలువలు, చెరువుల చుట్టూ ఉండే బఫర్ జోన్ల నిబంధనలు యథావిధిగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్, 2017 మరియు తదుపరి సవరణల ప్రకారమే అమలు అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More