అంతర్వేది సమీపంలో సముద్రంలో చిక్కుకున్న నౌక.. ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్

ఏపీలోని అంతర్వేది సమీపంలో సముద్రంలో నౌక చిక్కుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అందులోని సిబ్బందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేశారు.

Published on: Oct 29, 2026, 16:23:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బంగాళాఖాతంలో తుపాను కారణంగా అంతర్వేది సమీపంలో సముద్రంలో నౌక చిక్కుకుంది. విశాఖ నుంచి సింగపూర్ వెళ్తున్న నౌకగా గుర్తించారు. ఈ మర్చంట్ షిప్‌లో చిక్కుకున్న వారిని హెలీకాప్టర్ ద్వారా రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ చర్యలు ముమ్మరం చేసింది.

అంతర్వేది దగ్గర సముద్రంలో చిక్కుకున్న నౌక
అంతర్వేది దగ్గర సముద్రంలో చిక్కుకున్న నౌక

ఇప్పటికే 13 మందిని ఇండియన్ కోస్టు గార్డ్ షిప్ SUJAY లోకి సురక్షితంగా చేర్చారు కోస్టు గార్డ్ అధికారులు. ఇంకా నౌకలోనే మరో ఏడుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది.

మిగిలిన సిబ్బందిని తరలించేందుకు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను మోహరించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పదమూడు మందిని కోస్ట్ గార్డ్ నౌక సుజయ్‌కు సురక్షితంగా తరలించగా , మరో ఏడుగురు వాణిజ్య నౌకలోనే ఉన్నారు.

సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ

అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అమరావతి నుంచి కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్నారు. మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా అర్నబ్ తుపాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుపాన్ ప్రభావాన్ని పరిశీలించారు.

నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లను చంద్రబాబు పరిశీలించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలను ముఖ్యమంత్రికి సెక్రటరీ ప్రద్యుమ్న వివరించారు.

మరోవైపు అంతకుముందు క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. తుపాన్ నష్టంపై ప్రాథమిక నివేదికను అందిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలన్నారు సీఎం. 'ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలి. అర్నబ్ తుపాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసింది. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు. మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుపాన్ వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలి. రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేదు.' అని చంద్రబాబు అన్నారు.

'ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి. పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయటపడేయాలి. అర్నబ్ తుపాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశాం. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పడిపోయిన చెట్లను ఇప్పటికే చాలా వరకు తొలగించాం. రేపటిలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.' అని చంద్రబాబు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More