తీవ్ర రూపం దాల్చిన ‘అర్నబ్’ తుపాను తీరం దాటింది. నరసాపురం సమీపంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతి దిశగా, నరసాపురం పరిసర ప్రాంతాల్లో తుపాను తీరాన్ని దాటినట్లు అధికారులు ధ్రువీకరించారు.

తీరం దాటే సమయంలో గంటకు ఈదురుగాలులతో కూడిన తుపాను విరుచుకుపడింది. అనంతరం ఇది కొంత బలహీనపడి తీవ్ర తుపానుగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అధికారులు
తుఫాన్ తీరం దాటినప్పటికీ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు హెచ్చరించారు. తీరం దాటిన తర్వాత కూడా గాలివేగం, వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తుఫాన్ ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. తీరప్రాంత జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
రైతులు, మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సహాయక చర్యల కోసం యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.