తమిళనాడు బోటు ఘటన : ఏడుగురు మత్స్యకారులు మృతి - మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు
'మురసు' తుఫాన్ దాటికి ప్రకాశం జిల్లా తీరంలో తొమ్మిది మంది తమిళనాడు మత్స్యకారులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
తీవ్ర తుఫాన్ 'మురసు' సృష్టించిన భీభత్సం ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తుఫాన్ తీవ్రతకు సముద్రంలో చెలరేగిన అలల ధాటికి బోటు బోల్తా పడి తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం.... తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మురసు తుఫాన్ నేపథ్యంలో తమ బోట్లతో ఆంధ్రప్రదేశ్ రేవులకు చేరుకుని ఆశ్రయం పొందారు. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు వద్ద మురాసు తుఫాన్ తీరం దాటిన సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా రామాయపట్నం వద్ద మూడు, నిజాంపట్నంలో ఒక బోటును లంగరు వేశారు.
అయితే, నవంబర్ 3న నిజాంపట్నంలో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులు రెండు రాష్ట్రాల అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, రామాయపట్నం వద్ద ఉన్న తమ సహచరులను కలిసేందుకు సముద్రంలోకి ప్రయాణమయ్యారు. ఆ సమయంలో వీచిన ఈదురుగాలులు, ఎగసిపడిన అలల ధాటికి వారి బోటు సముద్రంలో బోల్తా పడింది.
మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు
గత మూడు రోజులుగా అధికారులు చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా, ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి ఆ బోటు కొట్టుకొచ్చినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గురువారం నాడు ఐదు మృతదేహాలను… శుక్రవారం(ఇవాళ) మరో రెండు మృతదేహాలను సముద్రం నుంచి వెలికితీశారు. ఇంకా ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు.
మృతుల కుటుంబాలకు లోతైన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి… సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, స్థానిక మత్స్యకారులు మరియు సంబంధిత రెస్క్యూ బృందాలు సమన్వయంతో పనిచేసి గల్లంతైన మిగిలిన ఇద్దరినీ త్వరగా గుర్తించాలని స్పష్టం చేశారు.
తీసిన మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేసి…. వారి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మృతులంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో…. ఆ రాష్ట్ర అధికారులతో వెంటనే సంప్రదింపులు జరిపి భౌతికకాయాలను వారి సొంత ఊళ్లకు సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

