తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా దీపావళి ఆస్థానం - స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
Tirumala Deepavali Asthanam 2026 : దీపావళి పండగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. మలయప్ప స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Tirumala Deepavali Asthanam 2026 : కాంతిమయ పండుగ దీపావళి శుభసందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలేశుని సన్నిధిలో దీపావళి ఆస్థాన వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ…. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.

స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ…
వేడుకల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటు ఆలయ సర్వసేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను బంగారు వాకిలి వద్ద ఉన్న గరుడాళ్వార్ సన్నిధిలో ప్రత్యేకంగా అమర్చిన సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివార్లకు, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, ఆస్థాన నిర్వహణ ప్రక్రియను అర్చకస్వాములు జరిపారు.
ఈ విశేష పర్వదినం సందర్భంగా మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. తిరుమల ధర్మకర్తల మండలి నిర్దేశిత అథారిటీ ఛైర్మన్, ఈవో ఎమ్. రవిచంద్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివార్లతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు :
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.
చివరి రోజు ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, కొలువు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేష అభిషేకం చేశారు.
సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ నిర్వహించి, ఆచార్యులకు బహుమానం సమర్పించడంతో పవిత్రోత్సవాలు సంపూర్ణమయ్యాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

