ప్రజల చేతిలో పల్లె రోడ్ల సమాచారం.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సిస్టం - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు.

అందుబాటులోకి రోడ్ల సమాచారం - డిప్యూటీ సీఎం
పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై ఆయా శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్షించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….. ”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలి. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలి. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలి" అని సూచించారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి - పవన్ కల్యాణ్
“క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలి. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయండి. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయండి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలి. ఈ అంశంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించండి” అని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని సూచించారు. తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

