Kurnool bus accident : పుర్రెలే మిగిలాయి! టైర్లు కూడా కనిపించడం లేదు- మాంసం ముద్దలా మృతదేహాలు..
కర్నూల్ బస్సు ప్రమాదంలో భయానక విషయాలు వెలువడుతున్నాయి. బస్సు అగ్నికి ఆహుతవ్వడంతో టైర్లు పూర్తిగా కాలిపోయాయి. చాలా చోట్ల పుర్రెలు మాత్రమే కనిపిస్తున్నాయి.
హైదరాబాద్- బెంగళూరు హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 20మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఘటనకు సంబంధించి వెలువడుతున్న దృశ్యాలు, వార్తలు అత్యంత భయాకనంగా ఉన్నాయి.

అగ్నికి ఆహుతైన బస్సు- పుర్రెలే మిగిలాయి!
హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. బస్సులో 40మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరుకు సమీపంలో ఈ ఏసీ బస్సు ఒక ద్వీచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ బండి బస్సు కింద ఇరుక్కుపోయింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొంత సేపటికే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది.
ఘటనా స్థలం నుంచి వెలువడుతున్న దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేసరికి బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎంతలా అంటే, ఇప్పుడు టైర్లు కూడా కనిపించడం లేదు!
కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు డోర్లు బద్ధలు కొట్టుకుని బయటపడగలిగారు. కానీ చాలా మంది బస్సులో చిక్కుకుపోయి, సజీవదహనం అయ్యారు. అనేక మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. బస్సును వీడియో తీసిన మీడియా సభ్యులు సైతం షాక్‌కి గురయ్యారు. చాలా చోట్ల పుర్రెలు మాత్రమే కనిపించాయి! ఎముకలు అక్కడక్కడ బయటపడ్డాయి. వెనుక భాగం నుంచి చూస్తే పూర్తిగా కాలిపోయి, మాంసం ముద్దలా మారిన కొన్ని మృతదేహాలు కనిపించాయి.
మరణించిన వారి వివరాలు ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. కాగా చాలా వరకు శరీరాలు కాలిపోవడంతో ప్రయాణికులను గుర్తించడం మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.
బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయిన ద్విచక్రవాహనం కూడా అగ్నికి ఆహుతైపోయింది.
ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు..
“నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్నాను. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక బస్సు తగలబడుతోందని తెలుసుకున్నాను. ఘటనాస్థలంలో చాలా మంది ఏడుస్తూ కనిపించారు. తమ వారు బస్సులో ఉండిపోయారని అరిచారు. బస్సు ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందని తెలిసింది. ఆ 2 వీలర్ డ్రైవర్ పక్కకు పడి, చనిపోయాడు. బస్సులో అస్తిపంజరాలు కనిపించాయి. నాకు ఏం చేయాలో తెలియలేదు. కర్నూల్ అధికారులను సంప్రదించాను. వారు వెంటనే స్పందించారు,” అని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.
క్షతగాత్రులకు చికిత్స..
కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదం సమయంలో ఎమర్జెన్సీ డోర్లు బద్ధలు కొట్టి బయటపడిన వారిలో 11మంది ప్రభుత్వ ఆసుపత్రిలో, ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ట్రావెల్స్ సంస్థ నుంచి ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు వివరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


