కర్నూల్ జిల్లాలో అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు- 20మంది మృతి! అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతైంది. బెంగళూరు వెళుతున్న ఈ బస్సు ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని హైదరాబాద్- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42మంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనలో 20మంది మరణించినట్టు, అనేక మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.

కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం- అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. తొలుత బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి.
“తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్‌కి చెందిన ఏసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ 2 వీలర్ బస్సు కింద చిక్కుకుపోయింది. దాని వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చు,” అని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. “ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు కిటికీలు బద్దలు కొట్టుకుని బయటపడాలి. అలా చేసిన వారు సురక్షితంగా ఉన్నారు,” అని వివరించారు.
కాగా బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో కొందరిని ఆసుపత్రికి తరలించారు.
“బస్సులో 40,42 మంది ఉండొచ్చు. నేను నలుగురిని రక్షించి, బయటపడ్డాను. కానీ నా కుటుంబ సభ్యుల్లో కొందరు మంటల్లో చిక్కుకుపోయారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు,” అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మీడియాకు వివరించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించింది.
మరోవైపు బస్సుకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. లోపల కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. కొన్ని చోట్ల పుర్రెలు మాత్రమే కనిపిస్తున్నాయి! అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్ర సీఎం చంద్రబాబు..
బెంగళూరు వెళుతున్న బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని స్పష్టం చేశారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కర్నూల్ బస్సు ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘోర ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందనని ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందన..
కర్నూల్ జిల్లా బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశించినట్టు వివరించారు.
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందన్న వార్త తీవ్ర ద్రిగ్బాంతికి గురి చేసిందని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై కర్నూల్ జిల్లా అధికారులతో మాట్లాడినట్టు వెల్లడించారు.
“బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను,” అని పొన్నం తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


