తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ - శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే…?

తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

Published on: Dec 25, 2025 5:38 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస సెలవులతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బారులు తీరి కనిపించాయి. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు కూడా రద్దీ పరిస్థితులు ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

దర్శనానికి ఎంత సమయమంటే..?

మరోవైపు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో…. క్యూలైన్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 25 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తాత్కాలికంగా క్యూలైన్లలోకి భక్తుల అనుమతిని నిలిపివేసిన టీటీడీ… రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ లోకి అనుమతించనుంది.

గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వారాంతం కావడంతో పాటు క్రిస్మస్ హాలీ డేస్ కూడా ఉన్నాయి. దీనికి తోడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది.

ఇక అలిపిరి వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో… అలిపిరి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది.

నిన్న తిరుమల శ్రీవారిని 73,524 మంది భక్తులు దర్శించుకున్నారు.29,989 మంది తలనీళాలు సమర్పించగా… హుండీ కానుకలు రూ. 4.88 కోట్లు వచ్చాయి. రాబోయే ఈ వారం రోజులు తిరుమలలో భక్తుల రద్దీ మరింత ఉండనుంది.

టీటీడీ చైర్మన్ తనిఖీలు:

తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని… సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు.

అనంతరం లడ్డూ కౌంటర్ లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు.