తిరుమలలో కళ్యాణకట్ట వద్ద టీటీడీ రోజుకు ఎన్ని బ్లేడ్లు ఉపయోగిస్తుందో తెలుసా?

తిరుమల అనగానే మెుదటగా గుర్తొచ్చేది తలనీలాలు ఇవ్వడం. భక్తులు వేల సంఖ్యలో ప్రతీరోజూ తలనీలాలు సమర్పిస్తారు. ఇందుకోసం టీటీడీ ఎన్ని బ్లేడ్లు ఉపయోగిస్తుందో తెలుసా?

Published on: Dec 17, 2025, 22:18:44 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల వెళ్లిన భక్తుల్లో చాలా మంది శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తలనీలాలు ఇస్తారు. అయితే ఇందుకోసం ఎన్ని వేల బేడ్లు ఉపయోగిస్తారో తెలిసింది. ఓ సంస్థ టీటీడీకి బ్లేడ్లను విరాళంగా అందించింది. ఈ సందర్భంగా ఈ విషయం తెలిసింది.

బ్లేడ్లను విరాళంగా అందిస్తున్న శ్రీధర్ బోడుపల్లి
బ్లేడ్లను విరాళంగా అందిస్తున్న శ్రీధర్ బోడుపల్లి

హైదరాబాద్‌కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామన్నారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాత శ్రీధర్‌ను ఛైర్మన్ అభినందించారు.

ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు.

టీటీడీకి రూ.60 లక్షలు విరాళం

టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన కె.యన్.నయన, వి.ప్రభా, రాజేష్, కె.యన్.రాజేష్, గుంటూరుకు చెందిన దేవరశెట్టి రితీష్, దేవరశెట్టి సత్యనారాయణలు వేర్వేరుగా రూ.10 లక్షల చొప్పున విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More