Kurnool Jaahnavi Kandula : అయ్యో… ఎంత విషాదం..! జాహ్నవి కందుల తండ్రి గుండెపోటుతో మృతి, పరిహారం రాకముందే..!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాహ్నవి కందుల ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలనే జాహ్నవికి 29 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేందుకు సియాటెల్ టౌన్ సిద్ధమైన సంగతి తెలిసిందే.

Published on: Feb 13, 2026, 14:21:32 IST
PTI | By , Kurnool
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో తెలుగు విద్యార్థి జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఆమె కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాహ్నవి కుటుంబం న్యాయపోరాటం చేస్తుండగా…. సెటిల్‌మెంట్ కోసం సియాటెల్ సిటీ ముందుకు వచ్చింది. 29 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. భారత్ కరెన్సీలో చూస్తే సమారు రూ.262 కోట్ల రూపాయలు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ నుంచి ప్రకటన విడుదలైంది.

జాహ్నవి కందుల
జాహ్నవి కందుల

అప్పట్నుంచి న్యాయపోరాటం…

కుమార్తె మృతికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ జాహ్నవి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు 2023 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే జాహ్నవి కుటుంబంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. కుమార్తె మృతిని తట్టుకోలేక… చాలా రోజులుగా మానసికంగా ఇబ్బందిపడుతున్న తండ్రి శ్రీకాంత్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో జాహ్నవి కుటుంబం మరింత విషాదంలోకి వెళ్లింది.

జాహ్నవి తండ్రి శ్రీకాంత్… హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. జాహ్నవి మరణం తర్వాత ఆయన మానసికంగా పూర్తిగా కుంగిపోయారు. లాంగ్ లీవ్ తీసుకున్నారు. అప్పట్నుంచి కుమార్తె మరణంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగానే అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ రావడంతో మళ్లీ విధుల్లో చేరేందుకు వెళ్లారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తుండగా శ్రీకాంత్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వైద్య సాయం అందేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

జాహ్నవికి న్యాయం కోసం చివరి వరకు నిలబడ్డ తండ్రి శ్రీకాంత్ మృతి చెందటంతో ఆ కుటుంబంలో కన్నీరుమున్నీరవుతోంది. ఇటీవలే ప్రకటించిన పరిహారం కూడా వారి వరకు రాకుండానే ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదంగా మారింది. శ్రీకాంత్ అంత్యక్రియలను బుధవారం ఆధోనీలో పూర్తి చేసినట్లు బంధువులు తెలిపారు.

జాహ్నవి కందుల 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. 2023 జనవరి 23 రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో ఫుటేజీ కూడా బయటికి వచ్చింది. పోలీసు అధికారి కెవిన్ డేవ్ ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడినట్లు తేలింది. అంతేకాకుండా ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆ పుటేజీ ద్వారా బయటపడింది.

సాధారణ వ్యక్తి మరణించిందని, ప్రాణానికి విలువ లేదని ఆఫీసర్ కెవిన్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు బాడీ కెమెరాలో రికార్డు అయింది. తర్వాత ఈ ఆడియో రికార్డింగ్ బయటపడిన తర్వాత నిరసనలను రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ దర్యాప్తు కూడా కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More