AP Liquor Scam : ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు - హైదరాబాద్ తో సహా 12 ప్రాంతాల్లో సోదాలు
AP Liquor Scam : ఏపీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. హైదరాబాద్, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ప్రధానంగా వైఎస్సార్సీపీకి చెందిన కీలక నేతలు, మాజీ ఉన్నతాధికారుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగాయి.

12 ప్రాంతాల్లో తనిఖీలు…
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం…. మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఇందులో హైదరాబాద్‌లోని 11 ప్రాంతాల్లో, తిరుపతిలోని ఒక చోట ఏకకాలంలో అధికారులు సోదాలు జరిపారు.
వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిల నివాసాల్లో అధికారులు తనిఖీలు చేశారు. తిరుపతిలోని వారి నివాసంలో కీలక పత్రాలను పరిశీలించారు.ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.
ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మాజీ చీఫ్ వాసుదేవ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో కూడా అధికారులు విచారణ చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల వ్యవహారమంతా ఈయన పర్యవేక్షణలోనే జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఉన్నతాధికారి ధనంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలతో పాటు ప్రైవేట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ బాలాజీ గోవిందప్ప నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డికి సంబంధం ఉందని భావిస్తున్న 'పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్' కార్యాలయాల్లో కూడా అధికారుల సోదాలు జరిగాయి. భూనేటి చాణక్య అనే వ్యక్తి నివాసంలో కూడా ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అసలేంటి కేసు….?
వైసీపీ హయంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నడపడం వెనుక భారీ అవకతవకలు జరిగాయని.. దీనిపై విచారణ జరిపేందుకు కూటమి ప్రభుత్వం… సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో చాలా మందిని సిట్ విచారించగా… పలువురిని అరెస్ట్ కూడా చేసింది. సిట్ దాఖలు చేసిన కేసు ఆధారంగా 2025 సెప్టెంబర్‌లో ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు కూడా నమోదు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో గతంలో ఒకసారి సోదాలు నిర్వహించిన ఈడీ…, ఇప్పుడు లభించిన తాజా సమాచారం ఆధారంగా రెండో విడత దాడులు చేపట్టింది. ఈ దాడుల అనంతరం కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

