AP Evening Courts : ఆంధ్రప్రదేశ్‌లో ఈవెనింగ్ కోర్టులు.. ఢిల్లీ, బీహార్‌‌లో కూడా ప్లానింగ్

AP Evening Courts : దేశంలోని పెండింగ్ కేసులను పరిష్కారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈవెనింగ్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Published on: Nov 11, 2026, 19:01:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న లక్షలాది కేసుల విచారణను వేగవంతం చేసేందుకు, సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ప్రయోగాత్మక ప్రాతిపదికన సాయంత్రం వేళల్లో కూడా కోర్టులు (Evening Courts) నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

ఏపీలో ఈవెనింగ్ కోర్టులు
ఏపీలో ఈవెనింగ్ కోర్టులు

తొలి దశలో భాగంగా ఈవెనింగ్ కోర్టులను పైలట్ ప్రాజెక్ట్‌ను ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విప్లవాత్మక ప్రతిపాదనను వెల్లడించారు.

ప్రస్తుతం కోర్టులు సాధారణ పగటి వేళల్లో మాత్రమే పనిచేస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ పనివేళలు ముగిసిన తర్వాత సాయంత్రం పూట అదనంగా కొన్ని గంటల పాటు కోర్టు బెంచ్‌లు పనిచేస్తాయి. దీర్ఘకాలంగా విచారణకు నోచుకోక పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి సివిల్, క్రిమినల్ కేసులు, ఇతర వివాదాలను వేగంగా పరిష్కరించడమే ఈ సాయంత్రం సెషన్ల ముఖ్య ఉద్దేశం.

కోర్టు సాయంత్రం సెషన్ల నిర్వహణ కోసం నిష్ణాతులైన రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా రాష్ట్రాల హైకోర్టుల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారు.

కేవలం సాయంత్రం కోర్టులకే పరిమితం కాకుండా, న్యాయ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను (ADR - Alternative Dispute Resolution) బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి కేసులను త్వరితగతిన ముగించడం, వివాదాలు కోర్టు మెట్లు ఎక్కక ముందే ఇరువర్గాల మధ్య మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునేలా ప్రోత్సహించడంపై ఫోకస్ చేస్తోంది.

ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రారంభించే ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు, కేసుల పరిష్కార వేగాన్ని పరిశీలించిన అనంతరం.. దీనిని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాలా వద్దా అనే దానిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధితులకు కాలయాపన తప్పడంతో పాటు భారతీయ న్యాయ వ్యవస్థలో కేసుల పెండింగ్ భారం గణనీయంగా తగ్గుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More