శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెనుకొండ మండలం పరిధిలోని గొల్లపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఐదుగురు మహిళలు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. దర్గాపేటకు చెందిన గాయత్రి (50), ఆమె కుమార్తె అశ్విని, వారి ఇరుగుపొరుగు స్నేహితులు పుష్ప, హసీనా, మహిన్తో కలిసి శుక్రవారం సరదాగా గొల్లపల్లి జలాశయాన్ని చూడటానికి వెళ్లారు. మధ్యాహ్నం వేళ డ్యామ్ వద్ద అందరూ కలిసి భోజనాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం సరదాగా గడిపేందుకు జలాశయం నీటిలోకి దిగారు. అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారిపోయి మునిగిపోయారు.
విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో నుంచి ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, అక్కడ చేపడుతున్న సహాయక చర్యల గురించి స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
గొల్లపల్లి జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లి ఐదుగురు మహిళలు మృత్యువాత పడటం చాలా బాధాకరమని మంత్రి లోకేశ్ అన్నారు. “మృతులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది” అని హామీనిచ్చారు.
ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మహిళలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.