విజయవాడ ఉత్సవ్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, విజయ్.. నదుల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు!
విజయవాడ ఉత్సవ్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ పాల్గొన్నారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చంద్రబాబు, విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా నదీ తీరాన ఉన్న పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడ నగరానికి తొలిసారి విచ్చేసిన తమిళనాడు సీఎం విజయ్‌కు ఏపీ ప్రభుత్వం, నగర ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు నేరుగా పున్నమి ఘాట్‌కు చేరుకుని విజయవాడ ఉత్సవ్‌లో నిర్వహించిన పలు విభిన్న సాంస్కృతిక, కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అశేష జనవాహిని మధ్య జరిగిన ఈ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం విజయ్ రాకతో విజయవాడ నగరం దద్దరిల్లిపోయిందని, అభిమానం ఆకాశమే హద్దుగా ప్రజలు తరలివచ్చారని అన్నారు. పార్టీ స్థాపించిన కేవలం రెండు సంవత్సరాలలోనే విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం విజయ్ నాయకత్వ పఠిమకు నిదర్శనమని కితాబిచ్చారు.
తమిళనాడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని చంద్రబాబు కొనియాడారు. 'రాష్ట్రాలు వేరైనా మా అభిమతం, ఆశయం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షిస్తున్నాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో ఏదైనా సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సాంకేతికత, పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత కూడా తోడైనప్పుడే సమాజం పురోగమిస్తుందని, ఇటువంటి ఉత్సవాలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణ భారతదేశంలో నీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో భవిష్యత్తులో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి అనే ఐదు ప్రధాన నదుల అనుసంధానం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులు విజయవాడ కేంద్రంగానే కలుస్తున్నాయని, రాబోయే రోజుల్లో గోదావరి-కావేరి అనుసంధానం కూడా సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగులో స్పీచ్ మెుదలుపెట్టిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రసంగాన్ని తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రారంభించి సభకు హాజరైన వేలాది మంది ప్రజలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ విజయవాడకు రావడం, దుర్గమ్మను దర్శించుకుని ఈ వేడుకల్లో భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు.
విమానాశ్రయం నుంచి పున్నమి ఘాట్ వరకు విజయవాడ ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారని చెబుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ విజయవాడ.. మీ చూపించిన నిష్కల్మషమైన అభిమానానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని భావోద్వేగంగా మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన భేటీలో ప్రధానంగా నదుల అనుసంధానం, నీటి వనరుల సమర్థవంతమైన వినియోగం, వ్యవసాయ అభివృద్ధి, రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విజయ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించడం జనాలకు ఆసక్తికరంగా అనిపించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


