ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - అమరావతి ORR, గోదావరి పుష్కరాలపై చర్చ, నిధులివ్వాలని విజ్ఞప్తి
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విశాఖ మెట్రో, గోదావరి-కావేరి అనుసంధానం, పుష్కరాల నిధులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సాయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం మరియు సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.

పదేళ్ల గుజరాత్ ముఖ్యమంత్రిగా, దశాబ్ద కాలంగా భారత ప్రధానిగా మొత్తం 25 ఏళ్ల పాటు ప్రభుత్వ అధినేతగా నిరంతర ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని, దేశానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.
సాగునీటి రంగంపై జరిగిన చర్చలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత నిర్మాణ పురోగతిని ప్రధానికి సీఎం వివరించారు. దీనితో పాటు దక్షిణాది రాష్ట్రాల జలసిరిని మార్చే గోదావరి - కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను వివరంగా తెలిపారు. గోదావరి - కావేరి అనుసంధాన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పుష్కలంగా తాగు, సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్‌లు, జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏ విధంగా విస్తరించాయో, అదే రీతిలో నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా 'నేషనల్ వాటర్ గ్రిడ్' ఏర్పాటుకు బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాలు 2027 – కేంద్ర సాయం వినతి…
వచ్చే 2027లో ఎంతో వైభవంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం ఇప్పటినుంచే భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున….. పుష్కరాల అభివృద్ధి పనులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రూపుదిద్దుకుంటున్న కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు. రాజధాని అమరావతి చుట్టూ ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం తెలపాలని కోరగా, విశాఖ బీచ్ రోడ్ ప్రాజెక్టు రూపకల్పన వివరాలను ప్రధానికి వివరించారు.
రాష్ట్రంలో ఆర్థిక పురోగతి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు, చివరి వ్యక్తి వరకు అందాలనే లక్ష్యంతో రూపొందించిన 'స్వర్ణాంధ్ర-2047 విజన్' ప్రధాన లక్ష్యాలను ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

