Hyderabad ORR : ఓఆర్ఆర్ వాహనదారులకు అలర్ట్ - రోడ్డుపై బండి ఆపితే భారీ జరిమానా..! ఈ రూల్స్ తెలుసుకోండి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప వాహనాలు ఆపకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

Published on: May 4, 2026, 12:18:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad Outer Ring Road safety: హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా భావించే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రాణాపాయానికి దారితీస్తోంది.

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు
హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు

ఈ నేపథ్యంలో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం, రోడ్డు భద్రతా విభాగం కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ఓఆర్ఆర్ పై ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన భద్రతా ప్రోటోకాల్స్‌ను విస్మరిస్తే ప్రాణాలకే కాదు, మీ జేబుకు కూడా చిల్లు పడటం ఖాయమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి…?

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను రహదారిపై నిలపకూడదు. చాలామంది విశ్రాంతి కోసమో, ఫోన్ మాట్లాడటానికో లేదా ఫోటోల కోసమో వాహనాలను రోడ్డు పక్కన ఆపుతుంటారు. హై స్పీడ్ కారిడార్‌ అయిన ఓఆర్ఆర్ పై ఇలా వాహనాలు ఆపడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక ఢీ కొంటున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో మరణాల రేటు అత్యధికంగా ఉంటోందని ట్రాఫిక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

14449 హెల్ప్‌ లైన్…

ఒకవేళ మీ వాహనం సాంకేతిక లోపంతో ఆగిపోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే అధికారులు లేదా ఔటర్ రింగ్ రోడ్డును సంప్రదించవచ్చు. కొన్ని ముఖ్యమైన సూచనలు…

  • తక్షణమే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.
  • సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ వాహనాలు అక్కడికి చేరుకుని తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తాయి.
  • భద్రతా కోన్లు (Safety Cones) లేదా ఇతర హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేసిన తర్వాతే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్ (Shoulder Lane) లో నిలపాలి.
  • వాహనం దిగిన వారు కూడా రోడ్డుపైకి రాకుండా జాగ్రత్త పడాలి.

ఈ నియమాలు కేవలం ఔటర్ రింగ్ రోడ్డుకే పరిమితం కాదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ జాతీయ రహదారి పై ప్రయాణించేటప్పుడైనా ఈ భద్రతా సూత్రాలను విధిగా పాటించాలి. హైవేల మీద ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల అమాయక ప్రయాణికులు బలవుతున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, కార్పొరేట్ సంస్థలు తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా నియమాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తారు.

“ప్రమాదాల నియంత్రణలో పోలీసులకు సహకరించి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాలని కోరుతున్నాను. నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. మీ భద్రతే మా బాధ్యత. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి” అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా వాహనదారులకు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More