2029 నాటికి సొంతింటి కల నెరవేరుస్తాం.. 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంతింటి కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల శంకుస్థాపనలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2029 సంవత్సరం పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో వంద శాతం పక్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి చూపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో అధునాతన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించనున్న ప్రయోగాత్మక ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
సాధారణంగా ఒక ఇల్లు నిర్మించడానికి దాదాపు రెండేళ్ల సమయం పడితే, ఈ 3D కాంక్రీట్ ప్రింటింగ్ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు అన్నారు. బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా మొదటగా 117 ఇళ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తున్నారని చెప్పారు. ఇది విజయం సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరింపజేస్తామన్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని, నివాసయోగ్యం కాని కొండలు, గుట్టల్లో పేదలకు స్థలాలు కేటాయించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు విమర్శించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లను నిర్మించి అందించిన ఏకైక ఘనత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.
నాయకుల పనితీరుపై చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెం ప్రస్తావన తెస్తూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ గారు వెండితెర హీరో అయితే, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి పొలిటికల్ హీరో అని వర్ణించారు. నియోజకవర్గ అభివృద్ధికై పెమ్మసాని నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.
నిత్యావసర ధరలు అదుపులో ఉంచడంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు చంద్రబాబు. అలాగే కూటమి విజయం కోసం త్యాగాలు చేసిన సీనియర్ నేత రాజేంద్రప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లు ప్రజలతో అనునిత్యం మమేకమవుతున్నారని కొనియాడారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్తున్నామని, రిలయన్స్ వంటి బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రజలకు తాను మధ్యప్రదేశ్ మామయ్యనే కాకుండా, ఏపీ మామయ్యగా కూడా సేవ అందిస్తానని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆలోచనా విధానం, విజన్ దేశానికే దిక్సూచిగా నిలుస్తాయని ప్రశంసించారు. ఇళ్ల నిర్మాణంలో 3D ప్రింటింగ్ సాంకేతికతను ప్రవేశపెట్టి దేశంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, పేదల గృహ నిర్మాణ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


