ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల

ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేరింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు సీఎం చంద్రబాబు విడుదల చేశారు.

Published on: Sep 2, 2026, 17:51:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం సాకారమైంది. గోదావరి జలాలు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర నేలను స్పృశించాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని క్రాస్ రెగ్యులేటర్ మీట నొక్కి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

అనకాపల్లి జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువ నిర్మాణం, నీటి ప్రవాహ తీరును పరిశీలించారు. అనంతరం పాయకరావుపేట చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక కళాకారులు సంప్రదాయ కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

గోదావరి జలాల రాకకు సూచికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ప్రవాహ ప్రాంతానికి చేరుకున్న ఆయన, కాలువ వద్ద గోదావరి మాతకు పవిత్ర జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనితలతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి తాగు, సాగునీటి ఎద్దడి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేసింది. ఎడమ కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,192 కోట్లను ఖర్చు చేసింది. ఈ కాలువ ద్వారా నాలుగు జిల్లాల పరిధిలోని దాదాపు 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సుమారు 9 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేలా ప్రణాళిక రూపొందించారు.

అనకాపల్లి వద్ద ఉన్న ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను ఈ జలాలతో సమర్థవంతంగా నింపనున్నారు. గోదావరి వరద జలాల వినియోగంతో ఉత్తరాంధ్రలోని అనేక ఆయకట్టు ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత లభించనుంది. పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80,000 ఎకరాలు, పంపా ప్రాజెక్టు పరిధిలో 12,000 ఎకరాలు, తాండవ, వరహా, మామిడిగడ్డ వీటన్నింటి పరిధిలోని 46,620 ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుంది.

వీటితో పాటు మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడం ద్వారా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని ప్రముఖ పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాతో పాటు తాగునీటి కొరతను అధిగమించేందుకు జలవనరుల శాఖ సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కొత్త ఉత్తేజాన్ని పుంజుకోనున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More