గోదావరికి వరద.. పోలవరం నుంచి నీటి విడుదల, లంక గ్రామాలకు హెచ్చరికలు

నదిపరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో… పోలవరం జిల్లా దేవీపట్నంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వరద నీటిలో చిక్కుకుంది. లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Jul 27, 2026, 13:03:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఇందులో భాగంగా పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం ఉదయానికే వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. ఆలయ పరిసరాలతో పాటు అమ్మవారి అంతరాలయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అధికారులు, అర్చకులు అప్రమత్తమయ్యారు.

గోదావరి (ఫైల్ ఫొటో)
గోదావరి (ఫైల్ ఫొటో)

గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయంలోని అమ్మవారి విగ్రహం వరకు వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణం, ముఖ్య మండపం, భక్తులు వెళ్లే క్యూలైన్లు అన్నీ నీటమునిగాయి. ఈ పరిణామంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అమ్మవారి దర్శనాలను తక్షణమే నిలిపివేశారు.

గోదావరిలో వరద ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు భక్తులందరూ అధికారులకు సహకరించాలని, క్షేత్ర సందర్శనకు ఎవరూ రావద్దని ఈఓ విజ్ఞప్తి చేశారు. వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆలయం సమీపంలో ఉన్న పూజా సామగ్రి, ఇతర వ్యాపార దుకాణాల్లోకి కూడా నీరు చేరింది. దీంతో స్థానిక వ్యాపారులు తమ వస్తువులను సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేసి వెళ్లారు.

డి.రావిలంక - దండంగి గ్రామాల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిని గోదావరి వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే అన్ని రకాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఏజెన్సీ వాసులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

పోలవరం నుంచి నీటి విడదల…

మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. గేట్ల ద్వారా నీటిని దిగువుకు విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో… లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More