...
...
Next Story

టీటీడీ పరకామణి చోరీ కేసు : రైల్వే ట్రాక్ పక్కన ఫిర్యాదు అధికారి డెడ్ బాడీ లభ్యం - అసలేం జరిగింది..?

టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఆయన… తాడిపత్రిలోని కోమలి రైల్వేట్రాక్‌పై శవమై కనిపించారు.

Published on: Nov 15, 2025, 09:37:54 IST
Advertisement

టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాం లభ్యమైంది. తిరుమలోని పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేసులో సతీశ్‌కుమార్‌ ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు.

ఘటనాస్థలంలో పోలీసులు
ఘటనాస్థలంలో పోలీసులు

అనంతపురం జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ…. సతీష్ కుమార్ మృతదేహాన్ని రైల్వే పట్టాలపై గుర్తించామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్ష ఫలితాలం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం సమయంలో రైల్వే కార్మికులు సాధారణ నిర్వహణ పనుల సమయంలో మృతదేహాన్ని చూశారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు…!

తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో అప్పుడు అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న సతీశ్ కుమార్… పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నారు. 2023 ఏప్రిల్ లో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పై ఫిర్యాదు చేశారు. తిరుమల ఆలయానికి వచ్చే నగదు, ఆభరణాల లెక్కింపు సమయంలో డబ్బును దొంగిలించానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చోరీ జరిగిన సమయంలో సతీష్ కుమార్ పరకామణి విభాగంలోనే పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా సతీషశ కుమార్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా…. అనుమానస్పదస్థితిలో మృతి చెందటం సంచలనంగా మారింది.

ఆత్మహత్య కాదు హత్యనే - టీడీపీ

మరోవైపు సతీష్ కుమార్ మృతితో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల వాగ్వాదం మొదలైంది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తూ… సతీష్ కుమార్ ను ఇబ్బందులు గురిపెట్టారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ఆరోపించారు. సతీష్ కుమార్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కోసం పిలిపించిందని… కానీ రైల్వే ట్రాక్ పై అనుమానస్పద స్థితిలో మృతి చెందారని చెప్పారు. సతీశ్ కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని… సతీష్ కుమార్ ముఖంపై గాయాలు ఉన్నాయని చెప్పారు. అతనిపై దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

“పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్న సతీష్ కుమార్ రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సీఐడీ విచారణలో విపరీతంగా బెదిరించి, అబద్ధాలు చెప్పించేందుకు తీవ్ర ఒత్తిడి చేయడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. సతీష్ కుమార్ ద్వారా నా పేరును చెప్పించాలని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సతీష్ కుమార్ ను వేధించింది. సతీష్ కుమార్ మరణం వెనుక కారణమైన విషయాలపై ఈ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి” అని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

సతీష్ కుమార్ మృతిపై వైసీపీ నేత సాకే శైలజనాథ్ స్పందించారు. సతీశ్ కుమార్ మృతిపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటకొస్తామని చెప్పరారు. రాజకీయ ఆరోపణలతో అసలు విషయాలను వక్రీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత… వారి స్వార్థ ఎజెండా కోసం పవిత్రమైన టీటీడీని రాజకీయ రంగస్థలంగా మార్చిందని ఆయన ఆరోపించారు.

సతీశ్ కుమార్ ది హత్యనేని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు సీఐడీ విచారణకు హాజరయ్యాడని… నాడు జరిగిన వాస్తవాలు అన్నీ సిఐడికి చెప్పారని చెబుతున్నారు. మరోసారి విచారణకు వెళ్తుంటే… మృతదేహామైపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks