...
...
Next Story

TTD : తిరుమలలో పాదరక్షల ట్రాకింగ్‌ సిస్టమ్‌కు భక్తుల ఫిదా.. త్వరలో మరిన్ని కౌంటర్లు!

తిరుమలలో పాద రక్షల ట్రాకింగ్ వ్యవస్థకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నూతన విధానంపై భక్తుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనితో త్వరలో మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించాలని టీటీడీ ప్రణాళికలు వేస్తోంది.

Published on: Feb 18, 2026, 22:05:59 IST
Advertisement

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అమలు చేస్తున్న QR కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ విశేష ఫలితాలను అందిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆధునిక సాంకేతికతతో అమలులోకి వచ్చిన ఈ విధానం ద్వారా భక్తులు తమ పాద రక్షలను సులభంగా డిపాజిట్ చేసి, తిరిగి వేగంగా పొందగలుగుతున్నారు.

తిరుమలలో  పాదరక్షల ట్రాకింగ్‌ సిస్టమ్‌
తిరుమలలో పాదరక్షల ట్రాకింగ్‌ సిస్టమ్‌

2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 8,45,816 పాద రక్షల డిపాజిట్-డెలివరీ లావాదేవీలు ఈ విధానం ద్వారా విజయవంతంగా నిర్వహించారు. ఈ కాలంలో భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాద రక్షల్లో, 4,21,769 పాద రక్షలను సురక్షితంగా తిరిగి అందజేశారు.

వీటిలో ఏటీజీహెచ్ కేంద్రంలో మొత్తం 44,714 పాద రక్షలు సేకరించగా, వాటిలో 44,340 పాద రక్షలు భక్తులకు పంపిణీ చేశారు. కృష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56,019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 55,238 పాద రక్షలు సేకరించగా, 54,928 పాద రక్షలు భక్తులకు అందించారు. పీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాద రక్షలు సేకరించగా, వాటిలో 1,37,904 పాద రక్షలు పంపిణీ చేశారు.

అదే విధంగా రామ్ భగీచ విశ్రాంతి గృహం కేంద్రంలో 76,556 పాద రక్షలు సేకరించగా, 76,071 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేంద్రంలో 53,250 పాద రక్షలు సేకరించబడగా, 53,098 పాద రక్షలు పంపిణీ జరిగాయి.

గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాద రక్షలు అస్తవ్యస్థంగా పడి ఉండటం, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చోరవ తీసుకుని ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధత పెరగడంతో భక్తులకు కలిగే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి.

గతంలో పాద రక్షలు పోవడం, గందరగోళం ఏర్పడడం వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవనీ, నూతన ట్రాకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు దాదాపుగా పూర్తిగా తొలగిపోయాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం, సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో కల్యాణకట్ట, బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడ వీధుల్లో దాదాపు ప్రతి రోజూ స్వామి వారు విహరిస్తారు కాబట్టి పాద రక్షలు ధరించడం నిషిద్ధం. భక్తులు తప్పనిసరిగా పాద రక్షల కోసం ఏర్పాటు చేసిన ఈ నూతన విధానాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.. ఈ ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ వల్ల తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగుపడటమే కాకుండా, భక్తులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించడమే ప్రధాన లక్ష్యంగా టీటీడీ ఈ Smart Shoe Keeping విధానాన్ని అమలు చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe