రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2025-26 ఖరీఫ్ పంట కొనుగోళ్లను నవంబర్ 3(సోమవారం) నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు మరియు 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి “7337359375” వాట్సాప్ నంబర్‌కు “హాయ్” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది అనుభవంతో ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అలాగే తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిగూడెం ఆరుగొలను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు.
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం… 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈసారి మాత్రం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమ్మిళితంగా పనిచేయడానికి… సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి నాదెండ్ల చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
48 గంటల్లో డబ్బులు జమ - మంత్రి నాదెండ్ల
ధాన్యం కొనుగోళ్ల కోసం 10,700 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. జిల్లాల్లో రియల్ టైమ్ మానిటరింగ్ అమలు చేస్తామని మనోహర్ తెలిపారు.