తిరుమలలో భక్తుల రద్దీ.. ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు
తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు టీటీడీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లు, ట్రాఫిక్, అన్నప్రసాదాల పంపిణీపై అదనపు ఈవో, జిల్లా ఎస్పీ సంయుక్త తనీఖీలు చేశారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం తిరుమలలోని దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులతో స్వయంగా మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్, ఇతర విభాగాలు సమన్వయంతో 24×7 పాటు ఆకుంఠిత దీక్ష తో పనిచేస్తున్నాయని చెప్పారు.
క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధంగా పంపిస్తూ తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. శుక్రవారం అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నామని, అదనంగా ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగను నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో తెలిపారు. రోజుకు దాదాపు 45 వేల లీటర్ల మజ్జిగ, 50 వేల లీటర్ల పాలను భక్తులకు అందిస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాలు షిఫ్టుల వారీగా 24 గంటలపాటు పనిచేస్తుండగా, మొబైల్ టీమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు.
భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని వెంకయ్య చౌదరి విజ్జప్తి చేశారు. భక్తులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో అంబులెన్సులు, వైద్య సేవలు, ఫుట్‌పాత్ ల వద్ద సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మే నెల ప్రారంభం నుంచే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. తిరుమలలో అదనపు ఎస్పీ స్థాయి అధికారితో పాటు డీఎస్పీలు, ప్రత్యేక బృందాలు 24 గంటలపాటు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు సుమారు 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని వెల్లడించారు.
టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయని ఎస్పీ చెప్పారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని భక్తులకు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


