AP Weather Report : ఏపీలో ఆగని భానుడి భగభగలు - తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, మరో 3 రోజులు ఇంతే..!

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. ఆదివారం (మే 24) తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో ఈ సీజన్ లోనే అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

Published on: May 24, 2026, 20:28:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. రోహిణి కార్తె ప్రవేశించిన వేళ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మే 24 (ఆదివారం) నాటి ఉష్ణోగ్రతలు ఈ సమ్మర్ సీజన్ లోనే అత్యధిక రికార్డులను నమోదు చేశాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3°C ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే విధమైన తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అప్రమత్తం చేసింది.

ఏపీలో నిప్పుల కుంపటిలా ఎండలు
ఏపీలో నిప్పుల కుంపటిలా ఎండలు

మే 25 (సోమవారం) ఉష్ణోగ్రతల అంచనాలు :

  • 45°C నుంచి 47°C వరకు (తీవ్ర ఎండలు) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం ప్రాంతం, ఏలూరు, ఎన్టీఆర్ (విజయవాడ), కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా
  • 43°C నుంచి 45°C వరకు : విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం మరియు నెల్లూరు పరిసర ప్రాంతాలు.
  • 40°C నుంచి 43°C వరకు : శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Wave), మరో 166 మండలాల్లో వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. విపరీతమైన ఎండల మధ్యే ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఉపశమనం లభించనుంది. మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి మరియు మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడవచ్చు.

కీలక సూచనలు:

  • బయటకు రావొద్దు : ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు, వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. బయటకు రాకపోవడం చాలా మంచిది.
  • పిడుగుల పట్ల జాగ్రత్త : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో లేదా ఐరన్ హోర్డింగ్స్ కింద నిలబడకూడదు.
  • ఆరోగ్య జాగ్రత్తలు : వడదెబ్బ తగలకుండా తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం లేదా నిమ్మరసం నిరంతరం తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More