Srisailam Water Level : శ్రీశైలం జలాశయంలో ఎంత నీరు ఉంది? ఇన్‌ఫ్లో వస్తుందా?

Srisailam Reservoir : శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 864.60 అడుగుల దగ్గర ఉంది. జలాశయానికి ఎటువంటి నీటి ప్రవాహాలు లేవని అధికారులు తెలిపారు.

Updated on: Sep 13, 2026, 14:48:11 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సుమారు 120.9532 టీఎంసీలుగా ప్రస్తుతం నమోదైంది. అలాగే జలాశయ నీటి మట్టం దాదాపు 864.60 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. దీని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. జూరాల ప్రాజెక్ట్, స్పిల్‌వే, సుంకేసుల, హంద్రీ ప్రాంతం లేదా పరివాహక ప్రాంతం నుండి జలాశయానికి ఎటువంటి నీటి ప్రవాహాలు లేవని అధికారులు తెలిపారు.

శ్రీశైలం జలాశయం(ఫైల్ ఫొటో)
శ్రీశైలం జలాశయం(ఫైల్ ఫొటో)

తెలంగాణకు చెందిన ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇందుకోసం సుమారు 41,075 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఎగువ నుంచి నీటి రాక లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తికి నీటిని నిరంతరం వినియోగిస్తుండటంతో, శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో కృష్ణా బేసిన్‌లోకి కొత్తగా నీరు వచ్చే సూచనలు ఏమీ లేనందున, నీటి నిల్వ స్థాయి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు

శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది.

సాధారణ దర్శనంతో పాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లన్నీ భక్తులతో పూర్తిస్థాయిలో నిండిపోయాయి. స్వామివార్ల దర్శనానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికీ త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్జిత అభిషేకాలు, శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమార్చన పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీని క్రమబద్ధీకరించడానికి పోలీసు శాఖ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టారు. క్యూ కాంప్లెక్స్‌లలో తోపులాటలు జరగకుండా నిఘా కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వరుసగా వచ్చిన సెలవుల కారణంగా సోమవారం కూడా ఇదే స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రానికి వచ్చే భక్తులు దేవస్థాన నిబంధనలను అనుసరించి సహకరించాలని, భద్రతా సిబ్బంది సూచనలను పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More