Post Monsoon Rains : మాన్‌సూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురిసే అవకాశం!

IMD Weather : రుతుపవనాల అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏడాది రుతుపవనాల ఆరంభం నుంచే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

Published on: Aug 4, 2026, 14:48:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది రుతుపవనాల ప్రవేశం తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు పడక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే రుతుపవన వ్యవస్థలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోందని అమరావతి భారత వాతావరణ శాఖ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఏపీ వర్షాలు
ఏపీ వర్షాలు

ఈ ఏడాది రుతుపవనాల ఆరంభం నుంచే రాష్ట్రంలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. జూన్ మాసంలో ఒకానొక దశలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 69 శాతానికి పైగా వర్షపాత లోటు నమోదైంది. దీనితో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎల్ నినో యాక్షన్ ప్లాన్‌ను కూడా అమల్లోకి తెచ్చింది.

జూలై నెలలో సైతం పరిస్థితి మెరుగుపడలేదు. ఎల్ నినో ప్రభావంతో అసమానంగా కురిసిన వర్షాల వల్ల 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వర్షాభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 65.5 శాతం వర్షపాత లోటు నమోదు కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 53.5 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 53.3 శాతం, పోలవరం ప్రాంతంలో 45.4శాతం మేర లోటు నమోదైంది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు 2002 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్ర కరువు పరిస్థితులను గుర్తుచేస్తున్నాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ఆ సంవత్సరం కూడా ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయం, తాగునీటి వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

అమరావతి ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఎస్. కరుణాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో రుతుపవనాల ట్రఫ్ వాయువ్య భారతదేశం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తుంది. అయితే ఈ ఏడాది ఈ ట్రఫ్ పదేపదే ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికే పరిమితం కావడంతో, వాయువ్య బంగాళాఖాతంలో మాత్రమే సాధారణ రీతిలో 3 వ్యవస్థలు ఏర్పడ్డాయి.

మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ తీరానికి తగినంత వర్షపాతం అందలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు తెచ్చే బలమైన వాతావరణ వ్యవస్థలు పోస్ట్ మాన్సూన్ (రుతుపవనాల అనంతర కాలం) సమయంలోనే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉందని కరుణాసాగర్ వివరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతం లేదా అండమాన్ సముద్రంలో వ్యవస్థలు ఏర్పడి, అవి ఏపీ తీరం వైపు పయనిస్తేనే రాష్ట్రంలో వర్షపాత లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More