Andhra pradesh Monsoon 2026 : ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు - రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు!

Southwest Monsoon Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం (జూన్ 6) రాయలసీమ ప్రాంతాల్లోకి ఇవి విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాగల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది.

Published on: Jun 6, 2026, 15:24:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Southwest Monsoon Andhra Pradesh : సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఎండతీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం….. జూన్ 6 శనివారం నాడు రుతుపవనాలు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలను తాకాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు!
రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు!

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే…. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత బలాన్ని పుంజుకుని, ఆంధ్రప్రదేశ్ అంతటా వేగంగా విస్తరించడానికి పూర్తి అనుకూల వాతావరణం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

రాయలసీమ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచే ఆకాశం మేఘావృతమై…. చల్లటి గాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. రుతుపవనాల రాకతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్ సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయనున్నాయి.

గతేడాదితో పోలిస్తే ఆలస్యం

గత సంవత్సరంతో పోల్చి చూస్తే…. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైందని చెప్పాలి. గతేడాది, అంటే 2025లో మే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు ఎంతో ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల జూన్ 4న కేరళను తాకిన రుతుపవనాలు…. అక్కడి నుంచి రెండు రోజుల్లోనే ఏపీలోకి అడుగుపెట్టాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాల్సి ఉండగా, ఈసారి దాదాపు అదే సమయానికి ఇవి పలకరించడం గమనార్హం.

రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలో ఉక్కపోత, వేడిమి పరిస్థితులు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే కొద్ది రోజుల పాటు వేడిగాలుల (హీట్ వేవ్) ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని…. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More