Machilipatnam Kurnool Train : ఏపీ ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో తీపి కబురును అందించింది. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆమోదముద్ర వేసింది. సౌత్ కోస్ట్ రైల్వే పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ కొత్త రైలుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

వారానికి మూడు రోజులు నడిచేలా (ట్రై-వీక్లీ) ఈ రైలు సర్వీసు రూపుదిద్దుకుంది. మచిలీపట్నంలో ప్రారంభమయ్యే ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, గుంటూరు జిల్లా పరిసరాలు, ప్రకాశం, నంద్యాల జిల్లాల మీదుగా కర్నూలు చేరుకుంటుంది. తీరప్రాంత పారిశ్రామిక కేంద్రమైన మచిలీపట్నం, నవ్యాంధ్ర వ్యాపార రాజధాని విజయవాడ, అలాగే రాయలసీమ ముఖ్య ప్రాంతమైన కర్నూలును ఒకే వరుసలో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో సమయం ఆదా కానుంది.
- ఈ రైలు మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కర్నూలుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 9.30 గంటలకు కర్నూలులో బయలుదేరి అదే రోజు రాత్రి 9.35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
- ఈ కొత్త రైలు మచిలీపట్నం వైపు నుంచి సోమ, బుధ, శనివారాల్లో ప్రయాణిస్తుంది. ఇక కర్నూలు వైపు నుంచి మంగళ, గురు, ఆదివారాల్లో బయలుదేరుతుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలుకు కీలకమైన అన్ని వ్యాపార, ఆధ్యాత్మిక మరియు విద్యా కేంద్రాల వద్ద కమర్షియల్ హాల్ట్‌లను కేటాయించారు. గుడివాడ, విజయవాడలతో పాటు పల్నాడు, సీమ ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.
ముఖ్యమైన హాల్టింగ్ స్టేషన్ల వివరాలు…
- గుడివాడ
- విజయవాడ
- నరసరావుపేట
- వినుకొండ
- దొనకొండ
- మార్కాపురం రోడ్
- కంభం
- గిద్దలూరు
- దిగువమెట్ట
- నంద్యాల
- బేతంచెర్ల
- ఢోన్