కడప జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమతో పేరుతో ఇంటర్ విద్యార్థిని వేధిస్తున్న ఓ ఉన్మాది రెచ్చిపోయి… అత్యంగా దారుణంగా చంపేశాడు. గొంతుకోసి హత్య చేశాడు. ఖాజీపేటలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులు…
ప్రాథమిక వివరాల ప్రకారం…. నిందితుడు వెంకటేష్ గత కొంతకాలంగా ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చని ఆ యువతి పెళ్లి ప్రతిపాదనను నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న వెంకటేష్…. శుక్రవారం యువతి ఇంటికెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి… యువతిపై దాడి చేసి అత్యంత క్రూరంగా గొంతు కోశాడు.
రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను కుటుంబ సభ్యులు గమనించి… ఆస్పత్రికి తరలించారు. కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆమె.. వెంకటేశ్ తో పాటు మరోవ్యక్తి పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. ఆస్పత్రికి చేరకముందే మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు అయితే నిందితుడు.ఇవాళ తెల్లవారుజామున తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.పారిపోతున్న నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడి వెనక్కి తగ్గకపోవటంతో…. అతడి కాళ్లపైకి కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
దర్యాప్తు కొనసాగుతోంది - జిల్లా ఎస్పీ విశ్వనాథ్
ఈ ఘటనను కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ధ్రువీకరించారు. లోతైన దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.