ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
IRCTC Tour : న్యూ ఇయర్‌లో ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర.. అద్భుతమైన ఆలయాల దర్శనం
IRCTC Divya Dakshin Yatra with Arunachalam : సౌత్ ఇండియాలో ముఖ్యమైన ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ అప్డేట్ ఇచ్చింది. దివ్య దక్షిణ్ యాత్ర విత్ అరుణాచలం పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. న్యూ ఇయర్‌లో ప్లాన్ చేసుకుని వెళ్లవచ్చు.
ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ నడుపుతోంది. 3 జనవరి 2027న తీసుకెళ్లనుంది. ఈ టూర్ 9 రోజులు, 8 రాత్రులతో ఉంటుంది. ట్రైన్‌లో వెళ్లాల్సి ఉంటుంది. మెుత్తం 705 సీట్లు ఉంటాయి. తిరువణ్ణామలై: అరుణాచలం ఆలయం, చిదంబరం: నటరాజ ఆలయం, తిరుచ్చి: శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరు: బృహదీశ్వరాలయం, రామేశ్వరం: రామనాథస్వామి ఆలయం, మధురై: మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారి: రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.

9 రోజుల టూర్ ప్లాన్ ఇలా
మెుదటి రోజు జనవరి 3వ తేదీన సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. బస చేసే ప్రదేశానికి వెళ్తారు. తరువాత అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అరుణాచలంలో బస ఉంటుంది.
మూడో రోజు ఉదయం బస చేసిన ప్రదేశం నుండి చెక్ అవుట్ అవుతారు. చిదంబరం ప్రయాణం కోసం తిరువణ్ణామలై రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. చిదంబరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, నటరాజ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత, తిరుచిరాపల్లికి బయలుదేరే రైలును ఎక్కుతారు. అదే రోజు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి బస చేసే ప్రదేశానికి వెళ్తారు. రాత్రికి తిరుచిరాపల్లిలో బస చేస్తారు.
నాలుగో రోజు ఉదయాన్నే అల్పాహారం ముగించుకుని శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి బయలుదేరాలి. ఆ తర్వాత తంజావూరుకు (రోడ్డు మార్గంలో సుమారు 60 కి.మీ.) ప్రయాణించి, బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. అనంతరం రామేశ్వరం వైపు తదుపరి ప్రయాణం కోసం మిమ్మల్ని తంజావూరు రైల్వే స్టేషన్‌లో దింపుతారు.
ఐదో రోజు మండపం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. బస చేసే ప్రదేశానికి వెళ్తారు, అక్కడ హోటల్ చెక్-ఇన్ అవ్వుతారు. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయాన్ని, స్థానిక ఆలయాలను సందర్శిస్తారు. రామేశ్వరంలో రాత్రి బస ఉంటుంది.
ఆరో రోజు ఉదయం బస చేసిన ప్రదేశం నుండి బయలుదేరి, మదురైకి వెళ్లే రైలు ఎక్కేందుకు మిమ్మల్ని మండపం రైల్వే స్టేషన్ వద్ద దింపుతారు. మదురై / కూడల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, మీనాక్షి అమ్మన్ ఆలయానికి వెళ్తారు. ఆపై కన్యాకుమారికి వెళ్లే రైలు ఎక్కేందుకు మిమ్మల్ని మదురై / కూడల్ నగర్ రైల్వే స్టేషన్ వద్దకు తీసుకెళ్తారు.
ఏడో రోజు కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. బస చేసే ప్రదేశానికి వెళ్లి స్నానం చేసి, ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్‌లను సందర్శించండి. అనంతరం సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం కోసం కన్యాకుమారి/నాగర్‌కోయిల్ రైల్వే స్టేషన్‌లో మిమ్మల్ని దింపుతారు.
ఎనిమిది, తొమ్మిది రోజుల్లో రైలులోనే ప్రయాణం ఉంటుంది. జనవరి 11తో టూర్ ముగుస్తుంది.
దివ్య దక్షిణ్ యాత్ర బడ్జెట్
ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర ఎకానమీ పెద్దలకు రూ.15,800, పిల్లలకు రూ.14,800 కాగా స్టాండర్డ్(3ఏసీ) పెద్దలకు రూ.23,200, పిల్లలకు రూ.22,000, కంఫర్ట్(సెకండ్ ఏసీ) రూ.29,600, పిల్లలకు రూ.28,100గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com సంప్రదించండి.

E-Paper
