రాజకీయ విశ్లేషణ : అమరావతి మన భవిష్యత్తు... మన ఆత్మగౌరవం
ఏపీ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ కొత్త ప్రతిపాదనను తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది. వారి వాదనను కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ రాజధాని విషయంపై విశ్లేషణ….
‘‘అయిపోయిన పెళ్లికి భజంత్రిలు’’ అన్నట్టు... నేడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు సరిగ్గా అలాగే తయారైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరంగా తిరుగులేని చట్టబద్ధత లభించి, నగర పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో... ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపడం హాస్యాస్పదంగా ఉంది. రాజధాని చట్టబద్ధం అయిపోయిన తర్వాత కూడా ఈ కపట ప్రదర్శనలు, ఈ వికృత నాటకాలు ఎందుకు చేస్తున్నట్లు…? రాజధాని విషయంలో 2014 నుండి నేటి వరకు కనీసం పదిసార్లు ‘యూ-టర్న్’ తీసుకున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది! ఒకసారి మూడు రాజధానులు అని రాష్ట్ర భవిష్యత్తును మూడు ముక్కలాటగా మార్చారు. ఇంకోసారి ఆయనే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ తుగ్లక్ తరహా నినాదాలు అందుకుంటారు. ఇలా రోజుకో మాట, పూటకో నైజంతో అమరావతిపై విషం చిమ్మడం, నిరంతరం కుట్రలు పన్నడం వైఎస్సార్సీపీకి ఒక వ్యసనంగా మారింది.

ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర అత్యంత బాధ్యతాయుతమైనది. ప్రభుత్వ విధానాలలో లోపాలు ఉంటే ఎత్తిచూపడం, ప్రజోపయోగకరమైన అభివృద్ధి పనులపై నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వడం ప్రతిపక్షం తాలూకు కనీస ధర్మం. కానీ, దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఆ పరిస్థితి లేదు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి, నేడు ప్రజాక్షేత్రంలో 11 సీట్లకు పరిమితమై, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ... వైఎస్సార్సీపీ నేతల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇంకా ఆ కసితో, ఆ అసూయతోనే రాజకీయం చేస్తున్నారు. అమరావతి సగర్వంగా పునర్నిర్మాణం జరుపుకుంటున్న తరుణంలో ప్రతిపక్షం పన్నుతున్న కపట వ్యూహాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి, విజ్ఞులైన ప్రజలు తిప్పికొట్టాల్సిన చారిత్రాత్మక అవసరం నేడు ఉంది.
2014లో విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారో అందరికీ గుర్తుంది."అమరావతికి మా మద్దతు నూటికి నూరు శాతం ఉంటుంది... కనీసం 30 వేల ఎకరాలైనా రాజధానికి సేకరించాలి" అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ, 2019లో అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ప్రజా తీర్పును, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను కాదని, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను కాలరాస్తూ 'మూడు ముక్కలాట'కు తెరతీశారు. పరిపాలనా వికేంద్రీకరణ అనే డొల్ల నినాదంతో రాష్ట్ర భవిష్యత్తును ఐదేళ్లపాటు పణంగా పెట్టారు. పచ్చని పంటలు పండే భూములను నవ్యాంధ్ర ప్రగతి కోసం త్యాగం చేసిన వేలాది మంది అమరావతి రైతులను నడిరోడ్డుపై నిలబెట్టి, వారిపై లాఠీఛార్జీలు చేయించారు. ఈ చారిత్రాత్మక ద్రోహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పటికీ క్షమించదు అనడానికి గత ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ఓటమితో వచ్చిన నిరాశ నిస్పృహలతో... ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతంలో మళ్లీ చిచ్చు పెట్టడానికి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కుతంత్రాలు మొదలుపెట్టారు. అందులో భాగమే ఇప్పుడు వారు కొత్తగా తెరపైకి తెచ్చిన "మావిగన్" (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) రాజకీయం మొదలుపెట్టారు. ఐదేళ్లపాటు అమరావతిని నిర్వీర్యం చేసి, ఇప్పుడు ‘మావిగన్’ అంటూ కొత్త పాట అందుకున్న జగన్, అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ పేరిట రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని, 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే మావిగన్‌ను రాజధానిగా ప్రకటిస్తామని చెప్తూ వైసీపీ నాయకులను అమరావతిపై దండయాత్రకు పంపడంతో... రైతులు ఆగ్రహంతో వారిపై తిరగబడ్డారు.
గతంలో అమరావతిని నానా విధాలా తూలనాడి… రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు లేఖలు రాసి అడ్డుపడింది ఈ వైఎస్సార్సీపీ కాదా? రివర్స్ టెండరింగ్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసింది వైఎస్సార్సీపీ కాదా? రాజధాని ఉద్యమంలో మహిళా రైతులను రాయలేని విధంగా దుర్భాషలాడి, 1631 రోజుల పాటు రైతులు, మహిళలు రాత్రి పగలు ఆందోళన చేసినా కనీసం పట్టించుకోకుండా, వారి పాదయాత్రను అడ్డుకున్నవారు... ఇప్పుడు ‘పరిరక్షణ’ పన్నాగంతో రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకొని దానికి మరణశాసనం రాసినవారు, నేడు ప్రదర్శనలు చేసినంత మాత్రాన వారి పాపాలు పరిహారం కావు.
వైఎస్సార్సీపీ కుట్రలను శాశ్వతంగా అడ్డుకోవడానికి, అమరావతికి సంపూర్ణ రక్షణ కల్పించడానికే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రాజధాని విషయంలో గతంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను, రాజకీయ అనిశ్చితిని శాశ్వతంగా తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అమరావతికి తిరుగులేని "చట్టబద్ధత"ను తీసుకువచ్చింది. ఈ చట్టబద్ధమైన గ్యారెంటీ వల్ల భవిష్యత్తులో ఏ రాజకీయ శక్తీ అమరావతిని కదిలించలేని విధంగా పటిష్టమైన కవచాన్ని నిర్మించింది.
ఎన్డీయే ప్రభుత్వంతో కూటమి నాయకులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఇవాళ అమరావతికి ఈ స్థాయి చట్టపరమైన రక్షణలు సాధ్యమయ్యాయి. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ మీడియా, ఆర్థిక నిపుణులు స్వాగతించారు. ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత లభించినప్పుడు, అంతర్జాతీయ పెట్టుబడులు ఎలా పెరుగుతాయో ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. ఈ చట్టబద్ధత వల్లే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి నిధుల సమీకరణ ప్రక్రియ ఇప్పుడు అత్యంత సులభంగా మారింది.
కూటమి ప్రభుత్వం అమరావతిని కేవలం కాంక్రీట్ కట్టడాల సముదాయంగా నిర్మించడం లేదు. ఈ నూతన నగరాన్ని అంతర్జాతీయ స్థాయి 'నాలెడ్జ్ అండ్ ఎకనామిక్ హబ్' గా తీర్చిదిద్దుతున్నది. అత్యాధునిక నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి, భావి తరాలకు ఉపాధిని, ఉజ్వల భవిష్యత్తును అందించే అక్షయపాత్ర కాబోతోంది. భూములిచ్చిన ప్రతి రైతు హక్కును కాపాడటానికి, వారి త్యాగాలకు సంపూర్ణ న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. రైతులకు అందాల్సిన ప్లాట్ల కేటాయింపులు, మౌలిక వసతుల కల్పనను ఒక నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం రాత్రింబగళ్లు శ్రమిస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మాకు, అలాగే రాష్ట్ర ఎంపీలందరికీ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను, హక్కులను సమర్థవంతంగా వినిపించడానికి ఈ చట్టబద్ధత ఒక దిక్సూచిగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుండి అమరావతి మౌలిక వసతుల రంగానికి, అత్యాధునిక రైల్వే కనెక్టివిటీకి, జాతీయ రహదారుల విస్తరణకు రావాల్సిన నిధులు ఎటువంటి రాజకీయ అడ్డంకులు లేకుండా సకాలంలో మంజూరవడానికి ఈ చట్టపరమైన రక్షణే అత్యంత ప్రధానమైన పూచీకత్తుగా మారింది.
రాజధానిపై పడిన నీలినీడలు పూర్తిగా తొలగిపోయి, అమరావతి సగర్వంగా తలెత్తుకుని నిలబడే రోజు ఆసన్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ వేగంతో, పారదర్శకమైన పాలనతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నది. అన్ని అడ్డంకులను దాటుకుని, న్యాయం వైపు నిలిచిన ప్రజా సంకల్పం గెలిచింది. విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మేధావులకు, ముఖ్యంగా రాజధాని ప్రాంత వాసులకు సవినయ విజ్ఞప్తి ఒక్కటే... వైఎస్సార్సీపీ పన్నుతున్న ‘మావిగన్’ కుతంత్రాలను మనమంతా ఒక్కటై తిప్పికొట్టాలి.
గత ఐదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్ది, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకునే ఈ చారిత్రాత్మక తరుణంలో... ప్రగతిని అడ్డుకోవాలని చూసే దుష్టశక్తులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అమరావతిని విధ్వంసం చేసినవారు, ఇప్పుడు దాని అభివృద్ధిని చూసి ఓర్వలేకనో, లేక రాజకీయంగా మనుగడ సాగించడానికో మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అమరావతి మన భవిష్యత్తు, మన ఆత్మగౌరవం. దీనిని కాపాడుకుంటూ, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదాం.
విశ్లేషణ : లింగమనేని రమేష్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ, జనసేన పార్టీ).

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు).
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


