శ్రీవారి భక్తులకు అలర్ట్ - నవంబరు 9న తిరుమలలో కార్తీక వన భోజనం, పలు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 9వ తేదీన కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించనుంది.ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు పలు సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. 

Published on: Nov 8, 2025, 14:20:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఈ కార్యక్రమం జరుగనుంది.

తిరుమలలో కార్తీక వన భోజనం
తిరుమలలో కార్తీక వన భోజనం

పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు.

ఉదయం 11 గంటల నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

పలు సేవలు రద్దు…

కార్తీక వన భోజన ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.

ముందుగా వచ్చిన వారికే టోకెన్లు - టీటీడీ ఈవో

శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీలో టీటీడీ మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. గతంలో ఉన్న డిప్‌ విధానం కాకుండా ఆన్‌లైన్‌ లో ముందు వచ్చిన వారికే ముందే అనే పద్ధతిలో టోకెట్లు ఇస్తామన్నారు. వచ్చే ఫిబ్రవరి నుండి ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్‌ ట్యాంక్‌ గెస్ట్‌ హౌస్‌ నుండి గోగర్భం డ్యాం సర్కిల్‌ వరకు పర్మినెంట్ షెల్టర్, క్యూ లైన్స్, స్టీల్ ఫూట్ ఒవర్ బ్రిడ్జిలు, టాయిలెట్స్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

భక్తుల సూచనలు మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈవో ప్రకటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More