రేషన్ కార్డు, పెన్షన్లపై కీలక అప్డేట్.. ఫ్యామిలీ యూనిట్‌గా మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశాలు

సంక్షేమం అందించి ఆగిపోకుండా.. వారికి సాధికారత సాధించే వరకు పేదల కోసం పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమనేది కూటమి ప్రభుత్వ విధానం అని చెప్పారు.

Published on: Sep 11, 2026, 12:22:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు మెుదలైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయి ఫలితాలపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు, జిల్లా అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ లబ్ధి పారదర్శకంగా ఏ ఆటంకం లేకుండా ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏయే సంక్షేమ పథకాలను ఏయే తేదీల్లో అర్హులకు అందిస్తున్నామనే సమగ్ర వివరాలతో కూడిన ‘సంక్షేమ క్యాలెండర్’ను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

కేవలం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి వదిలేయకుండా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సొంత కాళ్లపై నిలబడేందుకు, ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

సాంప్రదాయ కులవృత్తులు, చేతివృత్తులను బలోపేతం చేసేందుకు సరికొత్త కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఉత్పత్తుల నాణ్యత, విక్రయాలు పెంచేలా వాల్యూ అడిషన్ పద్ధతులను అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి చేనేత, చేతివృత్తుల కేంద్రాన్ని సందర్శకులను ఆకట్టుకునే ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రంలో జనాభా సమతుల్యత, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త పింఛన్లు జారీ చేసే ప్రక్రియకు ముందే కుటుంబాలను ఫ్యామిలీ యూనిట్‌గా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు.

పింఛన్ లేదా రేషన్ కార్డు పొందే ఉద్దేశంతో ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోవడం సరైన విధానం కాదన్నారు. పెద్ద కుటుంబాలకే ఎక్కువ ప్రయోజనాలు దక్కేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే.. అంత మందికీ తలో 5 కేజీల చొప్పున కోటా బియ్యం అందేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం సంక్షేమం కోసం ఇప్పటివరకు ఏకంగా రూ. 1.50 లక్షల కోట్లు వ్యయం చేసిందని, అందులో ఒక్క పెన్షన్ల కోసమే రూ. 75,000 కోట్లు వెచ్చించామని సీఎం గుర్తుచేశారు. ప్రతి నెలా క్యాలెండర్ ప్రకారం 1వ తేదీని పేదల సేవలో కార్యక్రమంగా నిర్వహిస్తూ నేరుగా సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు నెలలో కనీసం నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలపై వారితో చర్చించాలని కోరారు. గతంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది, సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించేలా ఉత్తమ విధానాలను అమలు చేయాలన్నారు.

పేదరికాన్ని నిర్మూలించేందుకు రూపొందించిన P4 (Public-Private-People Partnership) విధానాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కోసం సెర్ప్ (SERP), మెప్మా (MEPMA) సంస్థల భాగస్వామ్యంతో పని చేయాలన్నారు.

రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మహిళలు, పిల్లల్లో తీవ్రంగా వేధిస్తున్న రక్తహీనత సమస్యను పరిష్కరించి ఆరోగ్లకరమైన సమాజాన్ని నిర్మించడమే విజన్ 2047 ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More