ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయ్.. పర్యాటక ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులకు ఆహ్వానం
పర్యాటక ప్రాజెక్టుల కోసం పెట్టుబడుల ఆహ్వానిస్తున్నట్టుగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక రంగాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ భారీస్థాయిలో ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ భారీస్థాయిలో ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానం ఇచ్చారు.

స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 39,264 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల గత 18 నెలల్లోనే రూ. 20,088 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ఇది ఒక విప్లవాత్మక మార్పు అని అభివర్ణించారు. ఇందులో రూ. 9,445 కోట్లతో సుమారు 7,348 గదుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
నూతన పర్యాటక పాలసీ 2024-29తో పర్యాటక రంగంలో వినూత్న మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామన్నారు మంత్రి దుర్గేష్. అంతర్జాతీయ వేదికలపై ఏపీ బ్రాండ్‌ను పెంపొందించేకు కృషి చేశామన్నారు. తద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని వివరించారు. ముఖ్యంగా సీఐఐ సమ్మిట్‌లో పెద్దఎత్తున ఎంవోయూలు కుదర్చుకున్నామన్నారు.
నిధుల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని పిలిగ్రిమ్ రెజువనేషన్ అండ్ స్పిరుచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్( ప్రసాద్), స్వదేశీ దర్శన్ 2.0, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్ (సీబీడీడీ), స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్స్(శాస్కి) తదితర పథకాల కింద రాష్ట్రానికి రూ.429.06 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి దుర్గేష్ వివరించారు. శాస్కి ద్వారా అఖండ గోదావరికి రూ.94.44 కోట్లు, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అయిన గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు, అరకులోయ బొర్రా గుహల ఎక్స్ పీరియన్స్ సెంటర్ అభివృద్ధికి రూ.29.88 కోట్లు, సీబీడీడీ ద్వారా అహోబిలం అభివృద్ధికి రూ.25 కోట్లు, ప్రపంచ స్థాయి బౌద్ద గమ్యస్థానంగా నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధికి రూ.25 కోట్లు, ప్రసాద్ ద్వారా అన్నవరం, సింహాచలం వరహాలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాల్లో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 54.04 కోట్లు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు.
కొత్త ప్రతిపాదనలు
ఇప్పటికే కేంద్రానికి మరిన్ని ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రసాద్ పథకం కింద గుంటూరు జిల్లాలో మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీ గృహమల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామన్నారు.
దేశ్ దర్శన్ 2.0 పథకం కింద కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద మచిలీపట్నం బీచ్‌ను వైబ్రాంట్ బీచ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని మంత్రి దుర్గేష్ వివరించారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్‌ను కలిసి డీపీఆర్‌లు అందించామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ విశాఖ-అరకు, విశాఖ-సింహాచలం-అరసవిల్లి, రాజమహేంద్రవరం సర్క్యూట్, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రత్యేక సర్క్యూట్, అమరావతి, తిరుపతిలలో వివిధ రకాల సర్క్యూట్‌లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కోనసీమలో హోమ్ స్టే పాలసీ తీసుకొచ్చి హోమ్ స్టేలను పెంపొదిస్తున్నామన్నారు.
పెట్టుబడిదారులకు ఆహ్వానం
పర్యాటక ప్రాజెక్టుల కోసం అందుబాటులో ఉన్న భూముల వివరాలను(సర్వే నంబర్లతో సహా) పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉంచామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిబంధనల ప్రకారం డీపీఆర్‌లతో, బ్రాండింగ్ కంపెనీతో వచ్చే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇవేవీ తెలుసుకోకుండా కొందరు సభ్యులు పర్యాటక శాఖపై నిందలు వేయడం తగదన్నారు. దరఖాస్తు చేసుకునే ఉద్దేశముంటే పార్టీలకతీతంగా సహకరించేందుకు తాము సిద్ధమన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


