LPG Shortage : ఎల్పీజీ ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు!

LPG Shortage : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Published on: Mar 17, 2026, 07:55:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ వైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అయితే గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌‍లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) మద్దతుతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం విభాగం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు 44,346 ఇండక్షన్ స్టవ్‌లను సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు
అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

ఫేజ్ I కింద ఈఈఎస్ఎల్ ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసింది. ఈ మేరకు ప్రకటించింది. 1,200-W ఇండక్షన్ స్టవ్‌లకు మారడం వల్ల ఎల్పీజీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో వార్షిక పొదుపు రూ.24 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం వాతావరణంలోకి దాదాపు 28,327 టన్నుల CO₂ విడుదల కాకుండా నిరోధించగలదని అంటున్నారు.

ఇండక్షన్ స్టవ్‌లు సాంప్రదాయ ఎల్పీజీ స్టవ్‌ల కంటే దాదాపు 30 శాతం ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల చొరవ కేంద్ర ప్రభుత్వ గో ఎలక్ట్రిక్ ప్రచారానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రొగ్రామ్‌కు మద్దతు ఇచ్చినందుకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను అందించడానికి సత్వర నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ అఖిలేష్ కుమార్ దీక్షిత్. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఈ చర్య ఒక సాహసోపేతమైన అడుగు అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు చేరుతాయని అధికారులు చెబుతున్నారు.

ఎల్పీజీపై చంద్రబాబు సమీక్ష

యుద్ద ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు.. బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు. BPCL, HPCL. IOCL సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారుల వెల్లడించారు.

ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాపై చంద్రబాబు ఆరా తీయగా.. ఎలాంటి ఇబ్బందుల్లేవని అధికారులు తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

'ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాల్లోని రోజువారీ కార్యాకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలి. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్ లైన్, ఇండక్షన్ స్టవ్స్ ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలి.' అని సీఎం చంద్రబాబు చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More