NTR Health University : నో కాపీయింగ్... ఇకపై ప్రతిదీ రికార్డ్ - వైద్య విద్య పరీక్షలపై పక్కా నిఘా..!
రాష్ట్రంలో వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా ఉండనుంది. ఎన్టీఆర్ వర్శిటీలో రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల సీసీ కెమెరాలతో ఇక్కడికి అనుసంధానం చేస్తారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 'రిమోట్ కమాండ్ కంట్రోల్'ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక/సప్లిమెంటరీ పరీక్షల తీరును సీసీ కెమెరాల ద్వారా ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. దీనివల్ల కాపీయింగ్ వంటి ఘటనలకు అవకాశం ఉండదని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గతానుభవాల దృష్ట్యా వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పరీక్షలు జరిగే గదుల్లో ఉండే సీసీ కెమెరాలకు విశ్వవిద్యాలయంలోని రిమోట్ కమాండ్ కంట్రోలు రూముకు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమును మంత్రి సత్యకుమార్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ…. అన్ని కోర్సుల్లో కలిపి వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల కింద ఏడాదికి సుమారు 60వేల మంది పరీక్షలు రాస్తుంటారని తెలిపారు.
ఎంబీబీఎస్, పీజీ పరీక్షల నుంచి దశల వారీగా డెంటల్ ఆయుర్వేద, హోమియో, నర్సింగ్ ఇతర కోర్సుల్లో చదివే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను సైతం రిమోట్ కమాండ్ కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. ప్రస్తుతానికి 5 వైద్య కళాశాలల్లో ప్రస్తుతం జరిగే పరీక్షల తీరును గమనించడం ప్రారంభించినట్లు తెలిపారు. కాలేజీల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. ఈ రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రస్తుతం ఉన్న విధానానికి అదనంగా ఉంటుందన్నారు.
70 రోజుల వరకు నిక్షిప్తం!
- కళాశాలలోని గదుల్లో పరీక్షలు రాసే విద్యార్థుల కదలికలు కమాండ్ కంట్రోల్ రూములోని కంప్యూటర్లలో నిక్షిప్తమవుతాయి.
- ఇక్కడ జరిగే రికార్డింగ్ (దృశ్యాలు) 70 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది
- రికార్డింగ్ లోని దృశ్యాలు చెడిపోని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.
- కళాశాలల్లోని గదుల సామర్ధ్యాన్ని అనుసరించి సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
- ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఉంటాయి. కమాండ్ కంట్రోల్ రూములో మొత్తం ఆరు స్క్రీన్ల వీడియో వాల్ తోపాటు పది కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని ఉద్యోగులు నిశితంగా పరిశీలన చేస్తుంటారు.
- కళాశాలల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నా... వెంటనే కమాండ్ కంట్రోల్ రూములోనికి వారికి ఏఐ ద్వారా తెలిసేలా చర్యలు తీసుకున్నారు.
- ఉద్యోగులకు ర్యాండమ్ విధానంలో విధులను కేటాయిస్తారు. ఒకవేళ కళాశాలలో ఇంటర్నెటు కనెక్షన్ పనిచేయని సమయంలో జరిగిన దృశ్యాలు సైతం కనిపించేలా చర్యలు తీసుకున్నారు.
- పరీక్షలు ముగిసిన అనంతరం ప్రస్తుత విధానంలో మాదిరిగా కళాశాలల యాజమాన్యాలు సీసీ కెమెరాల వినియోగ హార్డ్ డిస్కును విశ్వవిద్యాలయానికి పంపించాల్సిన అవసరం ఉండదు.
- ఓరిగో బిజ్ సొల్యూషన్స్ సిస్టమ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కార్యకలాపాలు కొనసాగుతాయి. దూరాంక్ సంస్థ వారు సాఫ్ట్వేర్ అందించారు. "కేంద్రం ఏర్పాటుకు రూ.30 లక్షల వరకు ఖర్చు అయింది. రెండేళ్ల నిర్వహణ కింద రూ.1.5కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
- విశ్వవిద్యాలయం ద్వారా జరిగే ఇతర పరీక్షలను కూడా రిమోటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటాం' అని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

