Flight Services : విజయవాడ టు వారణాసి, కోల్‌కతా - ఆగస్ట్ నుంచి ఇండిగో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇలా

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్‌కతా నగరాలకు ఆగస్టు 13 నుంచి సరికొత్త ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి మూడు రోజులు నడిచే ఈ సర్వీసుల పూర్తి వివరాలు, సమయాలు మీకోసం.

Published on: Jul 8, 2026, 05:12:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తీపి కబురు అందించింది. ఆధ్యాత్మిక రాజధాని వారణాసి (కాశీ), చారిత్రక నగరం కోల్‌కతాతో విజయవాడను అనుసంధానిస్తూ సరికొత్త విమాన సర్వీసులను ఆగస్టు 13 నుంచి ప్రారంభించనుంది.

విజయవాడ టు వారణాసి, కోల్‌కతా
విజయవాడ టు వారణాసి, కోల్‌కతా

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఇండిగో ప్రతినిధులు ఈ సర్వీసులను రూట్ మ్యాప్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

పర్యాటక, వ్యాపార రంగాలకు కొత్త ఊపు

"ఈ కొత్త విమాన సర్వీసులు ప్రయాణికులకు ఎంతో సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి," అని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడ నుంచి ఉత్తరాది, తూర్పు భారత నగరాలకు నేరుగా కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు, పశ్చిమ బెంగాల్‌తో వ్యాపార సంబంధాలు ఉన్న వర్తకులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి. వారానికి మూడు రోజులు అంటే ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని ఇండిగో ప్రతినిధులు స్పష్టం చేశారు.

టైమింగ్స్ వివరాలు:

  • వారణాసి - విజయవాడ సర్వీస్ (6E 6501 ): మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • విజయవాడ - వారణాసి సర్వీస్ (6E 6502) : సాయంత్రం 6:20 గంటలకు విజయవాడలో బయలుదేరి, రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది.
  • కోల్‌కతా కనెక్టివిటీ: ఇదే 6E 6502 నెంబర్ గల ఫ్లైట్ విజయవాడ నుంచి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి, వారణాసి మీదుగా రాత్రి 10:15 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది.
  • కోల్‌కతా - విజయవాడ తిరుగు ప్రయాణం : 6E 6501 నెంబర్ గల ఫ్లైట్ మధ్యాహ్నం 2:10 గంటలకు కోల్‌కతాలో బయలుదేరి, వారణాసి మీదుగా సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

ఈ విమాన సర్వీసుల ప్రారంభంతో అమరావతి రాజధాని ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని పర్యాటక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇండిగో ఏపీ సేల్స్ మేనేజర్ మోహిత్ కృష్ణ, విజయవాడ అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్) సుభాని పాల్గొని మంత్రికి విమాన సర్వీసుల నిర్వహణ వివరాలను వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More